05-05-2025 12:00:00 AM
నాలుగు పదుల వయసులోనూ కెరీర్ పరంగా రాణిస్తున్నారు స్టార్ హీరోయిన్ త్రిష. ఇటీవల కోలీవుడ్‌లో వరుసగా విడుదలైన సినిమాల్లో ఆమె నటించింది. ఈ ఏడాదిలోనే ఆమె నటించిన మూడు చిత్రాలు విడుదలయ్యాయి. ఇంకా ఆమె నటిస్తున్న ‘విశ్వంభర’, ‘థగ్‌లైఫ్’, ‘సూర్య45’, ‘రామ్’ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే త్రిష ఇంతకుముందు చిరు సరసన ‘స్టాలిన్ ’ మూవీలో నటించింది.
ఆ సినిమా 2006లో విడుదలైంది. అంటే, సరిగ్గా పందొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ జంట కలిసి తెరపై అలరించేందుకు సిద్ధమైంది. చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ఠ ‘విశ్వంభర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తున్న సంగతీ విదితమే. ఇంకా ఇందులో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఎంఎం కీరవాణి సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవలే తొలిపాట విడుదలైంది. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సినిమాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇప్పటికే టీమ్ వెల్లడించింది.
ఓవైపు షూటింగ్ జరుపుతూ మరోవైపు డబ్బింగ్ పనులు ప్రారంభించేసింది చిత్రబృందం. మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో హనుమాన్ భక్తుడిగా కనిపించనున్నారు చిరంజీవి. ఇందులో ఆయనతో జత కడుతున్న త్రిష అవని పాత్రలో అలరించనుందట.
ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం త్రిష పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానులకు ఈ శుభవార్తను తెలియజేశారు. త్రిష పాత్రను పరిచయం చేస్తూ సినిమాలోని ఆమె లుక్‌ను రివీల్ చేశారు. ఈ రోల్ రివీల్ పోస్టర్‌లో త్రిష చీరకట్టులో మెరిసిపోతూ కనిపించింది.