05-05-2025 09:53:37 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): పెండింగ్ భూసేకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రూ.335 కోట్లు ఖర్చు చేసి గోల్నకా నుంచి అంబర్‌పేట వరకు 1.7 కిలోమీటర్ల పొడవున నాలుగు లైన్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో హైవేలను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పైవంతెన పనులు సరిగా జరగట్లేదని, వేగవంతానికి కాంట్రాక్టర్ ను మార్చాలని గడ్కరీ సూచించారు. పది నెలల్లో ఉప్పల్ పైవంతెన పూర్తిచేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ ఐటీ సిటీ, ఫార్మా రంగం కూడా పెద్దదని, హైదరాబాద్ కు అన్ని ప్రధాన నగరాలు అనుసంధానించేలా హైవేల అభివృద్ది చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధికి మేమంతా కట్టుబడి ఉన్నామని, ఇండోర్-హైదరాబాద్ కారిడార్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, హైదరాబాద్-విజయవాడ హైవేను ఆరు వరుసలుగా మార్చుతామని కేంద్రమంత్రి తెలిపారు.
అలాగే హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిని విస్తరించి 4 లైన్లుగా మార్చుతామని, హైదరాబాద్ రింగ్ రోడ్డుపై డబుల్ డెక్కర్ ఎయిర్ బస్సు తీసుకురావాలని, సీఎన్జీ, ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. సాకులోనూ పర్యావరణహిత వాహనాలు వాడాలని, స్మార్ట్ నగరాలతో పాటు స్మార్ట్ గ్రామాలు కావాలని సూచించారు. అంతకుముందు బీహెచ్ఈఎల్ చౌరస్తా ఫ్లైఓవర్ ను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఫ్లైఓవర్ పొడవునా ఫ్లైఓవర్ ఆఫ్ ది మెన్ నితిన్ గడ్కరీ అంటూ ఫ్లెక్సీలు కనిపించాయి. రూ.172 కోట్ల వ్యయంతో 6 లైన్ల ఫ్లైఓవర్ ను 1.6 కిలోమీటర్ల మేర నిర్మించడం జరింగింది.