calender_icon.png 28 July, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భర్త హత్యకు భార్య ప్లాన్..?

27-07-2025 10:46:15 PM

చనిపోయాడని వదిలి వెళ్లిన కిరాయి గుండాలు..

బాచుపల్లి పీఎస్ లో బాధితుడి ఫిర్యాదు..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): భార్యభర్తలు కలిసి కాపురం చేసి బిడ్డలను కన్నాక పరాయి వ్యక్తుల మోజులో పడి అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలను అడ్డు తొలగించుకునే కేసులు దేశంలో రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి ఘటనే బాచుపల్లి పోలీస్ స్టేషన్(Bachupally Police Station) పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. నిజాంపేట్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ... తాను కూడ అదే జాబితాలో చేరిపోవాలనుకుందో ఏమో తెలీదు కాని, తాను సైతం కిరాయి మనుషులతో భర్తను కడతేర్చాలనుకుంది. భర్తకు ఇంకా ఆయుష్షు ఉండటంతో బతికి బయటపడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... వనపర్తి జిల్లా, పెద్దగూడెం తండాకు చెందిన నేనావత్ రాందాస్ అనే వ్యక్తితో అదే ప్రాంతంలోని మర్రికుంటకు చెందిన జ్యోతి అనే మహిళతో 2009లో వివాహమైంది.

వివాహనంతరం దంపతులు బతుకుదెరువు కోసం నగరంలోని బాలానగర్ ప్రాంతానికి వచ్చి కూలిపనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ క్రమంలో మూడేండ్ల క్రితం దంపతుల మద్యన విభేదాలు తలెత్తడంతో జ్యోతి తన భర్తపై వనపర్తి పీఎఎస్ లో గృహహింస కేసు పెట్టింది. అప్పటినుండి రాందాస్ తన సొంత ఊరు అయిన తండాలో ఉంటుండగా, జ్యోతి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఒంటరిగా ఉంటూ ప్రగతినగర్ లోని జగన్ స్టూడీయో సమీపంలో జొన్నరొట్టెలను విక్రయిస్తూ జీవిస్తుంది. తమ కూతుళ్లు ఇద్దరిని తన తల్లిగారి ఇల్లు మర్రిగూడ వద్ద ఉంచింది. ఈ క్రమంలో నెలరోజుల క్రితం జ్యోతి పెద్దమనుషుల సమక్షంలో జరిగిన ఒప్పందంలో తాను భర్తతో కలిసి ఉంటానని ఒప్పుకుంది. అప్పటినుండి రాందాస్ తన భార్య జ్యోతితో కలిసి రాజీవ్ గృహకల్పలో నివాసముంటూ కూలీపనులకు వెలుతున్నాడు.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం పనికివెళ్లి వచ్చి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న రాందాస్ వద్దకు ఓ వ్యక్తి వచ్చి మీ భార్య జ్యోతి జగన్ స్టూడీయో వద్ద రొట్టెలు విక్రయించే చోటుకురమ్మంటుందని చెప్పగా ఆయన అక్కడకు వెళ్లాడు. శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఓ యువకుడు బైక్ పై జగన్ స్టూడియో వద్దకు వచ్చి రాందాస్ను మందుతాగుదాం రమ్మంటూ పిలిచాడు. తాను అప్పటికే తాగి ఉన్నానని, నేనెక్కడకి రానని సమాధానం ఇవ్వగా జ్యోతి కలుగజేసుకుని తెలిసిన వారే కదా వెళ్లి రా పో... అంటూ బలవంతపెట్టింది. దీంతో తప్పనిసరి పరిస్తితిలో రాందాస్ ఆతని వెంటవెళ్లగా ఇద్దరు కలిసి సాయినగర్ కమాన్ వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో గల ఉన్న వైన్ షాప్ లో రెండు బీర్లు కొనుగోలు చేశారు. అనంతరం అక్కడి నుండి ఇద్దరు కలిసి బౌరంపేట్ ఇందిరమ్మ ఇండ్లకు వెళ్లే దారిలో ఉన్న సర్కిల్ వద్దకు వెళ్లారు. అక్కడ రాందాస్ ఒక్కడిచే రెండు బీర్లు తాగించారు. ఈ లోగా మరో ఇద్దరు వ్యక్తులు ఆక్కడకు చేరుకున్నారు. తాగిన మైకంలో ఉన్న రాందాస్ పై దాడిచేసి బీర్ సీసాలతో తలపై బలంగా మోదారు.

దీంతో బాధితుడు సృహ తప్పి పడిపోవడంతో చనిపోయాడనుకుని నిందితులు  అక్కడి నుండి పారిపోయారు. అనంతరం రాత్రి 12 గంటల ప్రాంతంలో బాధితుడు రాందాస్ స్పృహ లోకి వచ్చి జరిగిన విషయాన్ని సమీపంలో నివాసం ఉంటున్న తన సోదరుడి ఇంటికి వెళ్లి వివరించాడు. ఆదివారం  బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై జరిగిన హత్య ఉదంతాన్ని పోలీసులకు వివరించి ఫిర్యాదు చేశాడు. అయితే బాధితుడు నివాసముంటున్న నిజాంపేట రాజీవ్ గృహ కల్ప సముదాయం బాచుపల్లి పీఎస్ పరిధిలోకి వస్తుండగా దాడి జరిగింది మాత్రం దుండిగల్ పీఎస్ పరిధిలోకి వస్తుందంటూ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు కేసును దుండిగల్ పీఎస్ కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా తనను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే జ్యోతి ఇతరులతో కలిసి పన్నాగం పన్నిందని రాందాస్ ఆరోపించారు. తనపై గృహహింస కేసు నమోదు చేయించినప్పటి నుంచి తనను పట్టించుకోని తన భార్య నెల రోజుల క్రితమే ఇక్కడికి రప్పించుకుందని పేర్కొన్నారు. అడ్డు తొలగించుకోవాలన్న పథకంలో భాగంగానే ఇదంతా జరిగిందన్నారు. తాను చనిపోయానని భావించిన అనంతరమే తనపై దాడి చేసిన వారు విడిచి వెళ్లారని  బావురుమన్నాడు బాధితుడు.