calender_icon.png 28 July, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలు, వరదల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

27-07-2025 10:57:39 PM

వ్యవసాయేతర అవసరాలకు యూరియా వినియోగిస్తే కఠిన చర్యలు..

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి సర్ఫరాజ్ అహ్మద్..

కరీంనగర్ (విజయక్రాంతి): భారీ వర్షాలు, వరదల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, యూరియా అక్రమ రవాణా నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్(HMDA Commissioner Sarfaraz Ahmed) అధికారులను ఆదేశించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సర్ఫరాజ్ అహ్మద్ ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల గండ్లు పడే అవకాశం ఉన్న చెరువులను ముందుగానే గుర్తించాలని అన్నారు. జలాశయాలను నీటి నిలువలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

అత్యవసర సమయాల్లో ఆపద మిత్ర వాలంటీర్లను అందుబాటులో ఉంచాలన్నారు. యూరియా అక్రమ రవాణా జరగకుండా, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించకుండా నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. గోదాముల్లో నిలువలు పరిశీలించాలని, నిల్వల వివరాలు బోర్డులో పేర్కొని టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని అన్నారు. యూరియా తీసుకెళ్లే రైతుల వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా అధికారులు యూరియా అక్రమ రవాణాను అరికట్టాలని, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యూరియాను అవసరానికి మించి వినియోగిస్తున్నారని, దీనివల్ల నేల స్వభావం దెబ్బతింటుందని, ఈ విషయం పట్ల రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. 

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గత సంవత్సరం డెంగీ, మలేరియా కేసులు ఎక్కడ ఎక్కువ నమోదయ్యాయో ఆ ఏరియాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వాసుపత్రిలో అన్ని రకాల మందుల నిల్వలు అందుబాటులో ఉంచాలని, ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేయాలని, ఇంటింటికి ఆరోగ్య సర్వే వేగవంతం చేయాలని ఆదేశించారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే మాట్లాడుతూ.. వరద విపత్తుల సాయం కోసం కలెక్టరేట్, మున్సిపల్ కార్పొరేషన్ వద్ద 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని అన్నారు.

ఆపదమిత్ర వాలంటీర్లను అలర్ట్ గా ఉంచామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 7 డెంగ్యూ, 1 మలేరియా కేసులు  నమోదయ్యాయని తెలిపారు. జిల్లాలో సాధారణ సగటు వర్షపాతం 339.1 కాగా 371.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదయిందని  తెలిపారు. లోయర్ మానేరు జలాశయంలో 24 టీఎంసీల కెపాసిటీ కి గాను 6.49 టిఎంసిల నీటి నిల్వ ఉందని, 1000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. జిల్లాలో కోళ్ల ఫారాలు, పరిశ్రమలలో యూరియా అక్రమ వినియోగంపై తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.