calender_icon.png 17 August, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుడమిపై ఎడతెగని యుద్ధాలు

17-08-2025 12:48:53 AM

ప్రపంచంలో దాదాపు సగం మంది ప్రజలు యుద్ధాలతోనే పగలు, రాత్రిని వెళ్లదీస్తున్నారు. చిన్న, చిన్న కారణాలు, మనస్పర్థలతో మొదలవుతున్న పలు యుద్ధాలు ఒకరిపై మరొకరు అణుబాంబులు వేసుకునే దాక వెళ్తున్నాయి. ఉక్రెయిన్ మొదలుపెడితే చాలా దేశాలు పొరుగు దేశాలతో యుద్ధాలతో బిజీబిజీగా గడుపుతున్నాయి. ఈ యుద్ధాలు సరిపోవన్న విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధానికి తెరతీశారు. సుంకాల బాంబులతో ప్రపంచ దేశాలు కంటి మీద కునుకు లేకుండా అవస్థలు పడుతున్నాయి.

అంతర్యుద్ధాలతో కొన్ని దేశాలు సతమతం అవుతుంటే మరికొన్ని దేశాలు వేరే దేశాలతో యుద్ధాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నాయి.  ఈ యుద్ధాలు జరిగేందుకు కారణాలు అనేకం కనిపిస్తున్నా.. ప్రయత్నిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. చాలా మట్టుకు దేశాలు పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయకుండా యుద్ధానికి కాలు దువ్వుతున్నాయి. ఎలాగైనా శత్రుదేశం మీద గెలవాలనే ఆతృతతో అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. తాము గెలిచిందే లెక్క అనుకుంటూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయి.

యుద్ధం చేస్తే శత్రు దేశంతో పాటు తమ దేశానికి కూడా నష్టం వాటిల్లుతుందనే సత్యాన్ని విస్మరిస్తున్నాయి. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపేందుకు కొద్ది మంది ప్రయత్నాలు చేస్తున్నా వారి ప్రయత్నాలు ఎటూ సరిపోవడం లేదు. ప్రపంచ శాంతి కామకులు, సంస్థలు కొన్ని దేశాల మధ్య యుద్ధాలను నిలువరించడంలో విజయం సాధిస్తున్నా.. మరికొన్ని దేశాల యుద్ధాల విషయంలో వారు వెనుకబడిపోతున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వెంటాడుతున్న ముప్పులో అణుముప్పు ప్రధానమైంది. ఈ అణుముప్పును తొలగించుకోవడం కోసం ప్రపంచంలోని అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చాలా మట్టుకు ఈ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. అణుముప్పును తప్పించుకోవడం కోసమని కూడా కొన్ని దేశాలు ఇతర దేశాలపై యుద్ధాలకు కాలుదువ్వుతున్నాయి. మానవాళిని వణికిస్తున్న కొన్ని యుద్ధాలు.. 

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో యుద్ధం

మధ్య ఆఫ్రికాలో ఉన్న ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలుగా యుద్ధం జరుగుతోంది. దేశీయ శక్తులతో పాటు అంతర్జాతీయ శక్తులు కూడా ఈ యుద్ధంలో పాల్గొంటూ వస్తున్నాయి. అనేక సాయుధ సమూహాలు, పొరుగుదేశాల ప్రమేయం ఉంది. ఈ యుద్ధం దేశంలోని పౌరుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చరిత్రలోకెళ్తే.. 1960ల కాలంలో కాంగో బెల్జి యం నుంచి స్వాతంత్య్రం పొందింది. అప్పటి నుంచి దేశం రాజకీయ, అస్థిరత, అంతర్యుద్ధాలు, తిరుగుబాట్లతో సతమతం అవుతూనే ఉంది.

దేశంలో ఉన్న అనేక సాయుధ సమూహాలు, పొరుగు దేశాలైన ఉగాండా, రువాండా, అంగోలా, జింబాంబ్వే, నమీబియా దేశాల వారు కూడా ఈ యుద్ధంలో పాల్గొంటున్నారు. ఇన్ని దేశాలు పాల్గొంటున్న కారణంగా ఈ యుద్ధాన్ని ఆఫ్రికా ప్రపంచ యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధానికి అనేక కారణాలు ఉన్నాయి. ఖనిజ వనరుల నియంత్రణ, రాజకీయ శక్తిగా మారేందుకు ప్రయత్నాలు, ప్రాంతీయ శక్తుల మధ్య వైరం మొదలైనవి ఉన్నాయి. 2003లోనే అధికారికంగా ఈ యుద్ధం ముగిసినప్పటికీ తూర్పు కాంగోలో హింస కొనసాగుతూనే ఉంది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో శాంతి, సామరస్యం నెలకొల్పేందుకు అంతర్జాతీయ సమాజం కృషి చేస్తోంది. 

మూడో ప్రపంచ యుద్ధం రానుందా? 

మానవుడు అభివృద్ధి పథాన దూసుకెళ్తున్న కొద్దీ యుద్ధాల బెడద పెరుగుతూ పోతుంది. నీ కంటే నేనెక్కువ.. మీ దేశం కంటే మా దేశం గొప్ప అనే పొరపొచ్చాలతో యుద్ధాలు ఆరంభమవుతున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడ్డ నానాజాతి సమితి విఫలం కావడంతో రెండో ప్రపంచయుద్ధం వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచంలోని అనేక దేశాలు విపరీతంగా నష్టపోయాయి. ఆస్ట్రియా యువరాజు హత్యతో మొదటి ప్రపంచయుద్ధానికి బీజం పడగా.. ప్రపంచదేశాలు భారీగా నష్టపోయాయి. ఇక మరో ప్రపంచ యుద్ధం రాకూడదని అంతా కలలు కూడా కన్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రెండో ప్రపంచ యుద్ధం జరిగింది.

జర్మనీ దేశం పోలండ్‌పై దాడి చేయడంతో రెండో ప్రపంచయుద్ధం మొదలైంది. ఆ రెండు దేశాల మధ్య మొదలైన యుద్ధం కాలక్రమేణా ప్రపంచయుద్ధంగా మారి మానవాళికి తీరని నష్టాన్ని మిగిల్చింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం వుడ్రో విల్సన్ కృషితో అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. ఇక అప్పటి నుంచి మరో ప్రపంచయుద్ధం రాకుండా చేయడంలో ఐక్యరాజ్య సమితి విజయం సాధించింది.

ప్రపంచ వ్యాప్తంగా 193 సభ్యదేశాలు, 2  అబ్జర్వర్ కంట్రీలతో ఉన్న ఐక్యరాజ్య సమితికి ఆంటోనియో గుటెరస్ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు. అనేక రంగాల్లో సేవలందిస్తున్న ఐక్యరాజ్య సమితి ప్రస్తుతం దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గిస్తూ.. విజయవంతంగా ముందుకెళ్తుంది. ఐక్యరాజ్య సమితి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని దేశాలు మాత్రం యుద్ధాలతో కాలక్షేపం చేస్తున్నాయి. ఆ దేశాలు కేవలం తమ పౌరులను మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉంటున్న అనేక మందిని నిత్యం భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.  

రష్యా యుద్ధం

అప్పుడెప్పుడో 2022 ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఇటు ఉక్రెయిన్, అటు రష్యా దేశాలు ఈ యుద్ధం వల్ల తీవ్రంగా నష్టాలను చవిచూస్తున్నాయి. కేవలం ఈ రెండు దేశాలని మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు ఈ యుద్ధం వల్ల ఇబ్బందు లు పడుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన అనంతరం జరుగుతున్న అతిపెద్ద యుద్ధంగా రష్యా యుద్ధం చరిత్రకెక్కింది. ఉక్రెయిన్‌లో రష్యన్ మాట్లాడే ప్రజల మీద అరాచకాలు, ఆకృత్యాలు జరుగుతున్నాయని యుద్ధాన్ని మొదలుపెట్టిన పుతిన్‌కు ఈ యుద్ధం పెద్ద షాకే ఇచ్చింది. ఏదో కొద్ది రోజుల్లో యుద్ధం ముగుస్తుందని భావించినా ఉక్రెయిన్ ఎవరూ ఊహించని విధంగా ప్రతిఘటిస్తోంది.

దీంతో రష్యన్ సైన్యానికి ఉక్రెయిన్‌ను లొంగదీసుకోవడం కొరకరాని కొయ్యగా మారింది. ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల కూటమి నాటోలో చేరడాన్ని తప్పుబట్టిన రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధం చేసి వారిని ఓడగొట్టి పంతం నెగ్గించుకోవాలని చూసింది. వాస్తవంలో మాత్రం ఉక్రెయిన్ తగ్గేదేలే అన్నట్టు ఏండ్లుగా పోరాడుతూనే ఉంది. క్యాలెండర్లు మారుతున్నా కానీ యుద్ధం మాత్రం ముగియడం లేదు. ఉక్రెయిన్, రష్యా ప్రజలే కాదు ప్రపంచంలోని అనేక దేశాల పౌరులు ఈ యుద్ధం వల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఇంత మంది ప్రభావితం అవుతున్నా.. ఈ దేశాలు తమ పంతాలను వీడట్లేదు. యుద్ధాన్ని ఆపడం లేదు. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు ఆర్థిక, సైనిక సహకారం చేస్తూ యుద్ధాన్ని ముగియకుండా చేస్తున్నాయనే వాదన కూడా ఉంది. 

ఇజ్రాయెల్ యుద్ధం

ఇజ్రాయెల్‌వూలస్తీనా యుద్ధం అనే కంటే ఇజ్రాయెల్ యుద్ధం అంటే అందరికీ సులభంగా అర్థం అవుతుందేమో... 2023 అక్టోబర్ 7నుంచి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూ రెండు వైపులా వేలాది మంది నిరాశ్రయులవుతున్నారు. యుద్ధం ముగించాలని ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి, పలు సంస్థలు మొత్తుకుంటున్నా కానీ యుద్ధానికి మాత్రం పుల్ స్టాప్ పడటం లేదు. 2023లో హమాస్ మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్‌పై వందలాది రాకెట్లతో అనూహ్యంగా దాడులకు దిగింది.

ఇజ్రాయెల్ ఇంటెలిజెన్సీకి ప్రపంచంలోనే గొప్ప పేరుంది. ఆ సమయంలో హమాస్ మారణకాండను అంచనా వేయడంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్సీ కూడా విఫలం అయింది. హమాస్ రాకెట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో అనేక భవ నాలు పేకమేడల్లా కుప్పకూలాయి. దాదాపు 250 మంది హమాస్ మిలిటెంట్లు ఇ జ్రాయెల్ ఇనుప కంచెలను బద్దలు కొట్టుకుని దేశంలోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఇజ్రాయెల్‌లో ఉన్న సైనిక స్థావరాలను, నగరాలను ల క్ష్యంగా చేసుకున్నారు. అనేక మంది అమాయక ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకుని గాజాకు తీసుకెళ్లారు. ఎన్నో రోజుల నుంచి దాడులు చేస్తున్న హమాస్‌ను ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ తక్కువగా అంచనా వేసి పొరబడింది.

ఇజ్రాయెల్‌కు చెందిన నిఘా సంస్థ మొస్సాద్‌ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థగా పేర్కొంటారు. ఇంత శక్తివంతమైన మొస్సాద్ కూడా హమాస్ దాడిని పసిగట్టలేకపోయింది. తమ దేశం మీద విచక్షణా రహితంగా దాడి చేసి తమ పౌరులను తీసుకెళ్లిన పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల మీద ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. 2023 నుంచి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నా ఇంకా ఎటూ తేలలేదు. పలు దఫాలుగా కాల్పుల విరమణ ఒప్పందాలు అమల్లోకి వచ్చినా రెండు దేశాల మధ్య దాడులు మాత్రం ఆగడం లేదు. ఎవరో హమాస్ మిలిటెంట్లు చేసిన తప్పుకు అమాయకులైన పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. 

సిరియాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధాలతో విలవిల్లాడుతుండగా.. మరో యుద్ధం ఆ జాబితాలో చేరింది. దక్షిణ సిరియాలో డ్రూజ్ మతానికి చెందిన పౌరులపై సైనిక దాడులను వ్యతిరేకిస్తూ.. ఇజ్రాయెల్‌కు చెందిన సైనిక దళాలు సిరియా అధ్యక్ష భవనంతో పాటు డమాస్కస్‌పై బాంబులతో విరుచుకుపడుతున్నాయి. డ్రూజ్ మైనారిటీలను కాపాడేందుకు ఈ దాడులు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు చెందిన సైనిక బలగాలు సిరియా సరిహద్దులకు చేరుకున్నాయి.

తమ నాయకత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే సిరియాపై దాడులు చేస్తున్నట్టు ఐడీఎఫ్ తెలిపింది. ఉత్తర సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉన్నామని తెలిపింది. డ్రూజ్ తిరుగు బాటుదా రులు, సిరియా సైన్యం మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైంది. దీంతో సిరియా బలగాలు డ్రూజ్ మైనారిటీలపై దాడులు చేశాయి. డ్రూజ్ మైనారిటీలను కాపాడేందుకోసం అని ఇజ్రాయెల్ ఈ యుద్ధంలోకి ప్రవేశించింది. తమ దేశంలోని భిన్న మతస్తులను పరిరక్షిస్తానని వాగ్దానం చేసిన సిరియా కొత్త నాయకుడు అహ్మద్ అల్ షరా డ్రూజ్ మతస్తులు, అలావైట్ తెగపై దాడులను నివారించడంలో విఫలం అయ్యారు.

మాజీ నియంత బషర్ అల్ అసద్‌కి చెందిన అలావైట్ తెగపై సిరియా సైన్యం విరుచుకుపడటంతో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆయుధా లు వదిలిపెట్టాలని కొత్త అధ్యక్షుడు పిలుపునిచ్చినా కానీ ఫలితం లేదు. దీంతో సిరియా సైన్యానికి, డ్రూజ్ తిరుగుబాటుదారులకు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అలావైట్ తెగపై సిరియన్ ఆర్మీ కాల్పులు జరపడంతో ఇజ్రాయెల్ ఆ తెగకు మద్దతుగా సిరియా రాజధాని డమాస్కస్‌పై బాంబులతో విరుచుకుపడింది. అరబ్ తెగకు చెందిన డ్రూజ్ మతస్తులు సిరియాతో పాటు లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల్లో వ్యాపించి ఉన్నారు.