calender_icon.png 2 May, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారులో మంటలు

02-05-2025 01:16:01 AM

హయత్‌నగర్ బస్టాండ్ ఎదురుగా ఘటన

 ప్రమాదం నుంచి తప్పించుకున్న దంపతులు 

ఎల్బీనగర్, మే 1 : వేసవిలో అగ్ని ప్రమాదాలు అకస్మాత్తుగా సంభవిస్తున్నాయి. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి ఘటన హయత్ నగర్ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మన్సూరాబాద్ కు చెందిన దంపతులు వ్యక్తిగత పనిపై సొంత కారులో గురువారం ఉదయం నల్లొండ జిల్లా ఏలిమినేడు గ్రామానికి వెళ్లి, తిరిగి మధ్యాహ్నం మన్సూరాబాద్ కు వస్తున్నారు. హయత్ నగర్ బస్టాండ్ వరకు రాగానే కారు ఇంజిన్ నుంచి పోగ, మంటలు చెలరేగాయి. గమనించిన దంపతులు వెంటనే కారు దిగి పక్కకు వెళ్లారు. అందరూ చూస్తుండగానే మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న హయత్ నగర్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.

హయత్ నగర్ పోలీసులు ప్రమాదాన్ని పరిశీలించారు. జాతీయ రహదారిపై కారు దగ్ధం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు తన సిబ్బందితో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. హయత్ నగర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ యాదగిరి మాట్లాడుతూ... వేసవిలో సొంత వాహనాల్లో ప్రయాణించేవారు వాహన కండిషన్ నిత్యం పరిశీలించాలన్నారు. షార్ట్ సర్క్యూట్ తో కారు ఇంజిన్ లో మంటలు అంటుకున్నట్లు తెలిపారు. కారు మంటల్లో చిక్కుకోవడంతో స్థానిక వ్యాపారులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.