calender_icon.png 6 May, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో పెరిగిన ప్రసవాల సంఖ్య

03-05-2025 11:25:04 PM

రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ స్పెషల్ ఫోకస్..

డిసిహెచ్ఎస్, సూపరిండెంట్లు, వైద్య సిబ్బంది సమన్వయంతో మంచి ఫలితాలు..

పెరిగిన నార్మల్ డెలివరీలు, తగ్గిన సిజేరియన్ సెక్షన్లు.. 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వివిధ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులైన భద్రాచలం, చర్ల, అశ్వరావుపేట, మణుగూరు, బూర్గంపాడు, పాల్వంచ, ఇల్లందులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో స్పెషలిస్ట్ వైద్యుల కొరత తీవ్రంగా ఉండేది. రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు, ప్రజాప్రతి నిధులు వివిధ సందర్భాలలో వైద్యుల కొరత పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు సూచించగా, జిల్లా కలెక్టర్ అదనపు ప్రోత్సాహకాలు ప్రకటించి నోటిఫికేషన్ ఇవ్వవలసిందిగా డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబుని ఆదేశించారు.

ప్రోత్సాహకాలతో కూడిన వేతనాలపై ఆకర్షితులైన వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లను మారుమూల ప్రాంతాలైన వివిధ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో నియమించారు. స్థానికంగానే ప్రసూతి వైద్యులు, పిల్లల వైద్యులు, మత్తు, రేడియాలజీ డాక్టర్లు అందుబాటులో ఉండటం, రోగులకు మంచి చికిత్స అందుతుండటంతో ప్రజలు సర్కారు ఆసుపత్రుల పై నమ్మకం ఏర్పడింది.  ఎప్పటికప్పుడు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల సమన్వయం, జిల్లా కలెక్టర్ సహకారంతో మౌలిక సదుపాయాల ఏర్పాటు మరియు 24 గంటలు అందుబాటులో డాక్టర్లు, వైద్య సిబ్బంది, అందుబాటులో ల్యాబ్ టెస్టులు, గర్భిణీ స్త్రీలకు చేసే ఎఎన్సి, టిఫ్ఫా స్కాన్లు, అందుబాటులో ప్రసవానికి సంబంధించిన మందులు ప్రసూతి వార్డుల్లో ఏసీలు మరియు కూలర్లు ఏర్పాటు చేయడం అన్నీ  కలగలిపి ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. 

మచ్చుకకు మణుగూరు ఆసుపత్రిలో ఫిబ్రవరి నెలలో కేవలం 8 డెలివరీలు కాగా, ఏప్రిల్ నెలలో 58 డెలివరీలు అవడం విశేషం. జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో 300 ఉన్న ప్రసవాల సంఖ్య ఏప్రిల్ నెలలో 400 కు చేరింది. భవిష్యత్తులో కూడా పెరిగే అవకాశం ఉంది. విశేషమేమిటంటే ప్రభుత్వ ఆసుపత్రులలో కోత లేకుండా  సుఖప్రసవాల సంఖ్య అధికంగా ఉంది. ప్రైవేటు ఆసుపత్రులతో పోలిస్తే సిజేరియన్ సెక్షన్ సంఖ్య ప్రభుత్వ ఆసుపత్రులలో చాలా తక్కువగా ఉంది.

సాధారణంగా ప్రైవేటు ఆసుపత్రులలో ఒక కాన్పుకు సుమారురూ 30 నుండి రూ40 వేలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో అంకితభావంతో పని చేస్తున్న వైద్య సిబ్బంది,  వసతులు, సౌకర్యాలు పెరగడంతో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ఆకర్షితులవుతున్నారు. తద్వారా పేద ప్రజలు తమ కాన్పుకి సంబంధించిన స్కానింగ్, రక్త పరీక్షలు, ఆపరేషన్, తదితర ఖర్చుల భారం తగ్గుతుందని, ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న మెరుగైన సేవల  పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆసుపత్రి సిబ్బంది సైతం తాము పనిచేస్తున్న ఆసుపత్రులలో కాన్పు చేయించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.