calender_icon.png 8 January, 2026 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘చలి’ చంపేస్తోంది..

07-01-2026 12:00:00 AM

ఏటూరునాగారం ఏజెన్సీలో పెరుగుతున్న చలి తీవ్రత

వృద్ధులు, చిన్నారులపైనే అధిక ప్రభావం

చలికి ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి

ములుగు, జనవరి 6 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో చలి పులి చంపేస్తోంది. రాగల రోజుల్లో చలి మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.. రోజురోజుకీ పెరుగుతున్న చలి తీవ్రతకి వృద్ధులు, చిన్న పిల్లలు అధికంగా అనా రోగ్యానికి గురవుతున్నారు. చలి అంటే అందరికీ సహజసిద్ధమైన ఋతువు. కానీ చల్లని గాలులు, ఉదయాన్నే కమ్మేసే పొగమంచు, రాత్రివేళల్లో చలికాలం తెచ్చే వణుకు ఇవన్నీ శరీరానికి కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సాధారణంగా చలి కాలం ఆనందదాయకమైనదే అయినా, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోకపోతే పులిలా దాడి చేసే ప్రమాదం ఉంటుంది.

అందుకే ఈ సీజన్ను సరిగ్గా ఎదుర్కోవడం చాలా అవసరం. అయితే ములు గు జిల్లాలో ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాం తం కాబట్టి చుట్టూ పక్కన పల్లెల్లో చలి తీ వ్రత రోజురోజుకు చలి విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతిరోజు తెల్లవారుజామున పొగ మంచు విపరీతంగా పడుతోంది. ఈ పొగమంచుకి వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ చలి తీవ్రతకి మండలంలోని గ్రామాల ప్రజలు బయటికి రావడం లేదు. వృద్ధులు, చిన్నారులు మాత్రం అనారోగ్యబారిన పడుతున్నారు.

వృద్ధులు, చిన్నారులపై అధిక ప్రభావం..

చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్న పిల్లలపైనే అధిక ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంది. వృద్ధులు, ఐదు సంవత్సరాల లోపు పిల్లలు చలి ప్రభావానికి ఎక్కువగా గురవుతారు. శరీర ఉష్ణోగ్రత త్వరగా తగ్గిపోవడం వల్ల వారిలో శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు, దమ్ము వంటి వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది. చలికాలంలో బిగుతైన, వేడిగా ఉంచే దుస్తులు ధరించడం తప్పనిసరి. చిన్నపిల్లల్లో గురక, ఎగశ్వాస, జలుబు, డబ్బు వంటి లక్షణాలు అధికంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు.

శ్వాసకోశ వ్యాధుల వారికి హెచ్చరిక..

ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు చల్లని వాతావరణంలో ఎక్కువసేపు ఉండకూడదు. బయటకు వెళ్లేటప్పుడు ముక్కు, చెవులు, మెడ కప్పుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తరచూ త్రాగడం, పొడి వాతావరణంలో తేమను నిలుపుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

గోరువెచ్చని నీరు, వేడి ఆహారం తప్పనిసరి..

చలికాలంలో శరీరం వేడిని కోల్పోతుంది. అందుకే వేడి పానీయాలు, సూపులు, గోరువెచ్చని నీరు తాగడం శరీర రక్షణకు ఉపకరిస్తుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.