calender_icon.png 23 December, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ హిందూ దేశమే!

23-12-2025 12:00:00 AM

  1. అది చెప్పేందుకు రాజ్యాంగపరమైన ఆమోదం అవసరం లేదు..
  2. పార్లమెంట్ ఆమోదం అంతకంటే అవసరం లేదు..
  3. రాజ్యాంగంలో ‘హిందూ’ అనే పదాన్ని చేరిస్తే ఓకే..
  4. చేర్చకపోయినా ఏం ఫర్వాలేదు..
  5. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో సంఘ్ చీఫ్ మోహన్ భగవత్

కోల్‌కతా, డిసెంబర్ ౨౨: ‘భారత్ ముమ్మాటికీ హిందూ దేశమే. దాని చెప్పడానికి ప్రత్యేకంగా రాజ్యాంగపరమైన ఆమోదం అవసరం లేదు. పార్లమెంట్ ఆమోదం అంతకంటే అవసరం లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత సత్యమో భారత్ హిందూ దేశమనేదికూడా అంతే సత్యం’ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కోల్‌కతాలో నిర్వహించిన ‘శత వ్యాఖ్యాన మాల’ వేడుకలో ఆయన మాట్లాడారు.

రాజ్యాంగాన్ని సవరించి, మళ్లీ రాజ్యాంగంలో ‘హిందూ’ అనే పదాన్ని చేర్చినా, చేర్చకపోయినా ఫర్వాలేదని తేల్చిచెప్పారు. తాము హిందువులమని, తమది హిందూ దేశమని చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడబోమని, హిందువులమని చెప్పుకొనేందుకు గర్వపడుతున్నామని ఉద్ఘాటించారు. పుట్టుకతో వచ్చే కుల వ్యవస్థ హిందుత్వానికి నిదర్శనం కాదని, భారత సంస్కృతిని ఆచరించే మెజారిటీ ప్రజల హిందూ జీవన విధానంతోనే దేశానికి ఆ గుర్తింపు వచ్చిందని అభిప్రాయపడ్డారు.

రాజ్యాంగ పీఠికలో ‘లౌకిక’ (సెక్యులర్) అనే పదాన్ని ఎమర్జెన్సీ సమయంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ చేర్చారని గుర్తుచేశారు. అంతకుముందున్న రాజ్యాంగంలో ఆ పదం లేదని స్పష్టం చేశారు. ఈ గడ్డను తమ మాతృభూమిగా భావించేవారు భారతీయ సంస్కృతి, పూర్వీకుల గొప్పతనాన్ని గౌరవించే పౌరులు ఉన్నంతకాలం ఇది హిందూ దేశమేనని పేర్కొన్నారు. పార్లమెంట్ చట్టం చేసినా, చేయకపోయినా ఈ సత్యం మారదని, ఇది ఆర్‌ఎస్‌ఎస్ మూల సిద్ధాంతమని ఆయన వివ రించారు.

భారతీయ సంస్కృతిని ప్రేమించేవారందరూ ఈ దేశంలో అంతర్భాగమేనని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్ అంటే ముస్లిం వ్యతిరేక సంస్థ అనే అపోహ చాలామందిలో ఉందని, అది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. సంఘ్ కార్యకలాపాలు అత్యంత పారదర్శకంగా ఉంటాయని, ఎవరైనా నేరుగా శాఖలకు వచ్చి తమ పనితీరును పరిశీ లించవచ్చని పిలుపునిచ్చారు. తాము ఏవైనా అంశాలకు వ్యతిరేకమని అనిపిస్తే, ఎవరైనా విమర్శించవచ్చని తెలిపారు. తమను అర్థం చేసుకోకుండా కేవలం ఊహాగానాల ఆధారంగా నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. నేర్చుకోవాలనే తపన లేనివారికి ఎవరు చెప్పినా అర్థం కాదని వ్యాఖ్యానించారు. 

ఓట్ల కోసమే బాబ్రీ మసీదు వివాదం

పశ్చిమ బెంగాల్‌లో బాబ్రీ మసీదు పేరు తో కొత్త వివాదం సృష్టించడం కేవలం ఓ రాజకీయ కుట్ర అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ బెంగాల్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఓట్ల కోసమే పాత వివాదాలను మళ్లీ తవ్వి తీస్తున్నారని ఆయన మండిపడ్డారు. మసీదు పునర్నిర్మాణం పేరుతో చేసే ఇటువంటి పనులు హిందువులకు కానీ, ముస్లింలకు కానీ ఏమాత్రం మేలు చేయవని స్పష్టం చేశారు. సమాజంలో ఇప్పటికే ఒక రకమైన సామరస్యం నెలకొందని, దాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

బెల్దంగాలో బాబ్రీ మసీదు పేరుతో పునాది రాయి వేయడాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వాలు ఎప్పుడూ దేవాలయాలు లేదా మతపరమైన కట్టడాలను నిర్మించకూడదని అభిప్రాయపడ్డారు. అయోధ్యలోని రామమందిరాన్ని సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ట్రస్ట్ ద్వారా నిర్మించారని గుర్తుచేశారు. నిర్మాణానికి ప్రభుత్వ నిధులు వినియోగంచలేదని, పూర్తిగా ప్రజల విరాళాలతోనే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

హిందూ సమాజం అంతా ఐక్యంగా ఉంటేనే భద్రత ఉంటుందని పేర్కొన్నారు. బెంగాల్‌లో హిందువులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సంతానం విషయంలోనూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 19 నుంచి 25 ఏళ్ల లోపు యువతీయువకులు పెళ్లి చేసుకుని, ముగ్గురు పిల్లలను కనడం ఆరోగ్యపరంగా మంచిదని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే.. ఈ విషయం కేవలం తాను విన్న సమాచారం మాత్రమేనని, తాను బ్రహ్మచారిని కాబట్టి ఈ విషయాలపై తనకు వ్యక్తిగత అనుభవం లేదని చమత్కరించారు.