18-12-2025 04:40:14 PM
మస్కట్: భారతదేశం-ఒమన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త విశ్వాసాన్ని, శక్తిని ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అన్నారు. మస్కట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఒమన్ వాణిజ్య, పరిశ్రమల, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ మంత్రి ఖైస్ బిన్ మహమ్మద్ అల్ యూసెఫ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుండి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. భారతదేశం తన అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానమైన అమెరికాలో 50 శాతం అధిక సుంకాలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఒప్పందం కుదిరింది. భారత్-ఒమన్ వ్యాపార సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ... ఒమన్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి ఈ సదస్సు భారత్-ఒమన్ భాగస్వామ్యానికి కొత్త దిశానిర్దేశం చేస్తుందన్నారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అంటే సీఈపీఏ, 21వ శతాబ్దంలో మన భాగస్వామ్యానికి కొత్త విశ్వాసాన్ని, కొత్త శక్తిని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
ఒమన్ తన సుంకాల జాబితాలోని 98 శాతానికి పైగా వస్తువులపై సుంకం లేకుండా ప్రవేశాన్ని కల్పించింది. ఒమన్‌కు భారతదేశం చేసే ఎగుమతులలో 99.38 శాతాన్ని కవర్ చేస్తుందన్నారు. మరోవైపు, భారతదేశం ఖర్జూరాలు, పాలరాయి, పెట్రోకెమికల్ వస్తువుల వంటి ఒమన్ ఉత్పత్తులపై సుంకాలను తగ్గిస్తుంది. రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు, తోలు, పాదరక్షలు, క్రీడా వస్తువులు, ప్లాస్టిక్స్, ఫర్నిచర్, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు, ఆటోమొబైల్స్‌తో సహా అన్ని ప్రధాన శ్రమ-ఆధారిత రంగాలకు పూర్తి సుంకాల మినహాయింపు లభిస్తుంది.