calender_icon.png 13 January, 2026 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధుల సంక్షేమానికి పాటుపడాలి

02-01-2026 12:00:00 AM

భారతదేశంలో ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య దాదాపు 15 కోట్లకు పైగా ఉన్నారు. శతాబ్దం చివరి నాటికి వృద్ధుల జనాభా 36 శాతానికి మించిపోతుందని నివేదిక చెబుతోంది. తెలంగాణలో చూసుకుంటే ఈ సంఖ్య 40 లక్షల మందికి పైమాటే. వయోధికుల సంక్షేమ సంఘాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల పేరుతో కొన సాగుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సేవ చేస్తామని ముం దుకు వచ్చే సంఘాలు పుట్ట గొడుగుల్లాగా పెరుగుతున్నాయి.

ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్లలలో ఎక్కువ మంది కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ద్వారా పెన్షన్ పొందేవారే ఎక్కువగా ఉన్నారు. ఈ సంఘాల నిర్వహణ కూడా వారి చేతిలోనే ఉంది. వయోధికుల సంక్షేమ సంఘాల పేరు చెప్పుకుని రాజకీ య నాయకుల కనుసన్నుల్లో మెదిలేవారు ఎక్కువగా ఉంటున్నారు. సేవ చేయాలనే తలంపుతో ప్రారంభించి, నాయకులతో విభేదించి మరొక సంఘం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు వృద్ధుల సమావేశాల్లో కేవలం వేతన సవరణ, పెండింగ్ కరువు భత్యాలు, వారికి రావలసిన బకాయిల గురించి ప్రస్తావిస్తూ, ధర్నాలు, నిరసనల వరకే పరిమితమ వుతున్నారు. 

వృద్ధులు అంటే కేవలం పెన్షన్ పొందే వారు కాదు. సమాజంలో ఎంతో మంది ప్రైవేట్ రంగంలో పని చేసేవారు, రైతులు, భవన నిర్మాణ కార్మికులు, దినసరి వేతన ఉద్యోగులు, ఆటో ఉద్యోగులు వయస్సు మీద పడి అచేతనంగా ఉండే వారిని కూడా సీనియర్ సిటిజన్స్‌గా గుర్తించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే  వారు తమ రెక్కలనే నమ్ముకొని కాయాకష్టం చేసుకొని బతుకు బండి లాగించి వయస్సు మీద పడి వైద్యం, పౌష్టికాహారం లభించక నులక మంచంపై పడుకున్నవారికి ఆపన్న హస్తం అందించే వారు కరువైపోయారు.

తల్లిదండ్రులు, వయోధికుల సంక్షే మ చట్టాల గురించి తెలియక పోవడం, కుటుంబ సభ్యుల వల్ల జరిగే అవమానాలు, దౌర్జన్యాలు, ఆస్తి పంపకాల్లో వివాదాల పరిష్కారం కొరకు ప్రభుత్వ అధికారులకు తెలియజేసే వ్యవస్థ ఉందని వారికి తెలియజేసే అవసరం ఉంది. నగరాల్లో ఉండే వయోధికుల సంక్షేమ దృష్ట్యా మాత్రమే సంఘాలు ఏర్పడుతున్నాయి. కేవలం బస్సుల్లో రాయితీలు, బ్యాంక్, పోస్ట్ ఆఫీసులో ప్రత్యేక కౌంటర్లు, దేవాలయాలు, పార్క్‌లలో ఉచిత ప్రవేశం, భవనాలు గురించి మాత్రమే ప్రస్తావిస్తూ ఉంటారు. పల్లెలలో నివసించే వృద్దులకు చేతి కర్రలు, చూపు లోపించిన వారికి కంటి చికిత్స, వారికి ఉచిత కళ్ళద్దాలు ఇప్పించే బాధ్యత నగరాల్లో ఉండే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ బాధ్యత వహించాలి. 

నగరాల్లో ఏర్పాటైన వయోధికుల సంక్షేమ సంఘాలు కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని వృద్ధుల సంక్షేమం కోసం పాటు పడాలి. జిల్లా కేంద్రాల్లో ఉండే డే కేర్ సెంటర్లు గ్రామాల్లో ఏర్పాటు చేయాలి. రైతు వేదికల మాదిరిగా వయోధికులకు కూడా వేదికలు ఏర్పాటు చేయాలి. నగరాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వారంలో ఒక రోజు వృద్దులకు చికిత్స చేస్తున్నట్లుగా గ్రామాల్లోనూ ఒక రోజు సంచా ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. వయోధికుల సంక్షేమ సంఘాలు కేవలం నూతన సంవత్సర క్యాలండర్లు, డైరీలు ప్రచురించడం, శుభాకాంక్షలు తెలపడం, ఫోటోలు దిగడం వరకే పరిమితం కాకూడదు. స్వార్థపూరిత రాజకీయాలు, పదవి కాంక్షలు, రాజకీయ నాయకులు చేతిలో కీలు బొమ్మల్లాగా ప్రవర్తించే వ్యక్తులను దూరంగా ఉంచాలి. పెన్షనర్లు సీనియర్ సిటిజన్స్ సంఘాల్లో నాయకత్వం వహించరాదు. సంక్షేమ సంఘాలు స్వచ్ఛంద సేవ దృక్పథంతో పని చేసినప్పుడే సార్థకత ఏర్పడుతుంది.

 ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్