05-01-2026 12:00:00 AM
కేంద్రానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సవాల్
ముంబై, జనవరి 4: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుజులా అధ్యక్షుడు మదురోను బంధించినట్లే.. పాకిస్థాన్‌పై కూడా బారత్ దాడి చేసి, మసూద్ అజార్‌ను పట్టుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై దాడుల సూత్రధారులను భారత్ కూడా ట్రంప్ లాగే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ముంబైలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యం మరో దేశంలోకి వెళ్లి అక్కడి అధ్యక్షుడినే తీసుకురాగలిగినప్పుడు భారత్ ఎందుకు వెనుకబడి ఉందని ప్రశ్నించారు. పాకిస్థాన్లో దాక్కున్న ఉగ్రవాదులను పట్టుకోవడానికి మోదీ భారత సైన్యాన్ని పంపాలని ఓవైసీ కోరారు.
మసూద్ అజర్ వంటి కరడుగట్టిన ఉగ్రవాదులను దేశానికి తీసుకువచ్చి శిక్షించాలని పేర్కొన్నారు. ట్రంప్ కంటే మోదీ తక్కువేమీ కాదని చురకలు అంటించారు. గతంలో ప్రధాని మోదీ ’అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ అని నినాదం ఇచ్చారని ఓవైసీ గుర్తు చేశారు. ఇప్పుడు అదే ట్రంప్ శైలిలో పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉగ్రవాదుల ఏరివేత విషయంలో అమెరికాను ఆదర్శంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. భారత్ ఒక బాధ్యతాయుతమైన దేశమని వారు పేర్కొన్నారు. అంతర్జాతీయ సంబంధాల విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోందని బీజేపీ స్పష్టం చేసింది. ఓవైసీ కేవలం సంచలనం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.