calender_icon.png 27 January, 2026 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు భారత్- యూనియన్ శిఖరాగ్ర భేటీ

27-01-2026 01:12:20 AM

నిరుద్యోగులకు, విద్యార్థులకు మేలు చేసే ఒప్పందాలకు ప్రాధాన్యం

‘పోస్ట్ -స్టడీ వీసా’ నిబంధనలపై స్పష్టత వచ్చే ఛాన్స్

‘మైగ్రేషన్, మొబిలిటీ’కి ఇరువైపులా ఒకే?

ఎఫ్‌టీఏపై ఒక్కటి కానున్న ఇరుదేశాలు

రక్షణ సాంకేతికతను భారత్‌కు బదిలీపై సమాలోచనలు

న్యూఢిల్లీ, జనవరి 26 : యూరోపియన్ యూనియన్-, భారత్ మధ్య మంగళవారం ఢిల్లీ వేదికగా శిఖరాగ్ర సమావేశం జరుగనుంది. విద్యార్థుల పోస్ట్ స్టడీ వీసా నిబంధనలు, మైగ్రేషన్, మొబిలిటీ పార్ట్నర్‌షిప్, స్వేచ్ఛా వాణిజ్యం(ఎఫ్‌టీఏ)పై ఒప్పం దాలను కుదుర్చుకోనున్నాయి. ‘విజన్ 2030’ పేరుతో ఒక ఆధునిక వ్యూహాత్మక ప్రణాళికను ప్రవేశపెట్ట నున్నారు. ఇది రాబోయే ఐదేళ్లలో వాతావరణ మార్పులు, డిజిటల్ టెక్నాలజీ, ఇంధన రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తుంది.

రష్యా- యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ అంశాలపై కూడా నాయకులు చర్చించనున్నారు. ఈ చారిత్రాత్మక భేటీలో భారత్, యూరోపియన్ దేశాల మధ్య మూడు ప్రధాన రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. వీటిలో అత్యంత ముఖ్యమైనది ‘వలసలు, రాకపోకల భాగస్వామ్య (మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్‌షిప్’) ఒప్పందం. దీని ప్రకారం భారతీయులకు ప్రతి ఏటా దాదాపు 1,00,000 వరకు వర్క్ పర్మిట్స్ ఇచ్చేందుకు ఐరోపా దేశాలు అంగీకారం కుదరనుంది.

అలాగే భారత్ విద్యార్థులు చదువు ముగిసిన తర్వాత అక్కడ ఉద్యోగాలు సాధించేందుకు 12 నెలల పాటు ఉండేందుకు అనుమతించే ‘పోస్ట్-స్టడీ వీసా’ నిబంధనలపై కూడా స్పష్టత రానుం ది. ఐరోపాలో పెరుగుతున్న నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతను తీర్చడంలో భారతీయులు కీలక పాత్ర పోషించబోతున్నారు. మరోవైపు, సుదీర్ఘ కాలంగా చర్చల దశలో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) పై ఒక రాజకీయ ఏకాభిప్రాయానికి ఇరు పక్షాలు రానున్నాయి. దీనిని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ గా అభివర్ణిస్తున్నారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే భారత్ ఐటీ కంపెనీలకు, ఫార్మా రంగానికి, వస్త్ర పరిశ్రమలకు ఐరోపా మార్కెట్లలో భారీగా అవకాశాలు పెరుగుతాయి.

అలాగే ఐరోపా నుంచి దిగుమతి వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయం వంటి సున్నితమైన అంశాలను ప్రస్తుతానికి పక్కన పెట్టి, ఇతర వాణిజ్య రంగాల్లో ముందుకు వెళ్లాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. రక్షణ రంగంలో కూడా ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలవనుంది. ‘సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్టనర్షిప్’ ద్వారా సముద్ర తీర రక్షణ, సైబర్ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్, ఐరోపా కలిసి పనిచేయనున్నాయి. భారతీయ రక్షణ రంగ కంపెనీలు ఐరోపా దేశాల రక్షణ కాంట్రాక్టులలో పాల్గొనేందుకు కూడా ఈ ఒప్పందం మార్గం సుగమం చేస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ పథకంలో భాగంగా అధునాతన రక్షణ సాంకేతికతను భారత్‌కు బదిలీ చేసే అంశంపై కూడా చర్చలు జరుగనున్నాయి.