20-05-2025 01:21:16 AM
బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గానేత్ విన్ ఓవెన్
చౌటుప్పల్, మే 19 (విజయక్రాంతి): భారతీయ హస్తకళలు అద్భుతమైన వని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గానేత్ విన్ ఓవెన్ ప్రశంసించారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం టెక్స్ టైల్ పార్కులోని మిమీ క్రాఫట్స్ హస్తకళల కేంద్రాన్ని ఆయన సోమవారం సందర్శించారు. అక్కడ గిరిజన కళతో తయారుచేసిన అలంకరణ వస్తువులను పరిశీలించారు.
ప్రాచీనమైన ‘బాతిక్ ‘ పద్ధతిలో వస్త్రాలకు మైనాన్ని పూసి వివిధ రకాల ఆకృతులతో రంగులు అది ఫ్యాషన్ వస్త్రాలు తయారుచేసి పద్ధతిని తిలకించారు. భారతీయులు పూర్వకాలం నాటి పద్ధతిలో పత్తితో నేసిన నూలుపై టై అండ్ డై, స్క్రీన్, బ్లాక్ ప్రింటింగ్ చేసి చీరలు, డ్రెస్ మెటీరియల్ తయారు చేస్తున్న హస్త కళాకారుల పనితనాన్ని పరిశీలించారు.
తాను స్వయంగా బ్లాక్ ను చేత పట్టుకొని రంగులో ముంచి వస్త్రంపై ప్రింటింగ్ చేసి భారతీయ హస్తకళలపై తన అభిమానాన్ని చాటుకున్నారు. హస్త కళాకారులను, ప్రాచీన హస్తకళలకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్న కృష్ణమూర్తి, పుష్పలత లను ఆయన అభినందించారు. భారతీయ హస్తకళల గురించి తనకు పరిచయం చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మిమి క్రాఫట్స్ నిర్వాహకుడు, ఫ్యాషన్ డిజైనర్ కే. కృష్ణమూర్తి మాట్లాడుతూ, భారతీయ హస్త కళలు ఎంతో ప్రాచీనమైనవని, విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందాయని తెలిపారు. యాంత్రికరణ, పారిశ్రామికీకరణ పెరిగినా కూడా ఈ భారతీయ హస్త కలలకు గౌరవం పెంచేందుకు, ఇవి అంతరించిపోకుండా కాపాడేందుకు ప్రాచీనతకు, ఆధునికతను జోడించి తన వంతు కృషి చేస్తున్నట్టు చెప్పారు. మిమీ క్రాఫట్స్ నిర్వాహకురాలు పుష్పలత బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ను హస్తకళ శాలువాతో సన్మానించారు.