01-05-2025 10:15:31 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ 2025 మహబూబాబాద్ జిల్లాలో నిర్వహణ ఏర్పాట్లను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(Collector Adwait Kumar Singh) గురువారం పరిశీలించారు. ఈనెల 4న జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించే పరీక్షకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా నుంచి నీట్ అర్హత పరీక్షకు 513 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇందుకోసం ముగ్గురు అబ్జర్వర్లతో పాటు 46 మంది ఎనిమిది లీటర్లను నియమించడం జరిగిందని, పరీక్షలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. సీసీ కెమెరాల పనితీరును మరోసారి సరి చూడాలని ఏవైనా ఇబ్బందులు తలెత్తితే కొత్తవి అమర్చాలని ఆదేశించారు. పరీక్ష గదుల్లో ఫర్నిచర్, లైటింగ్, పరిశుభ్రత, తాగునీటి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత సమయానికి హాజరుకావాలని, పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కే. వీరబ్రహ్మచారి, డి.ఎస్.పి తిరుపతిరావు, ఆర్డీవో కృష్ణవేణి, డీఈవో రవీందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ జాక్విరన్, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.