02-12-2024 12:00:00 AM
ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్
కాన్‌బెర్రా: ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండ్రోజులు జరగాల్సిన డే అండ్ నైట్ మ్యాచ్ వర్షం వల్ల మొదటి రోజు రద్దయింది. గులాబీ బంతితో జరిగే ఈ మ్యాచ్‌ను 50 ఓవర్ల పాటు నిర్వహించాలని నిర్ణయించగా.. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ తీసుకుంది. కానీ మ్యాచ్ ఆరంభం అయిన కాసేపటికే మరలా వరుణుడు అడ్డు తగలడంతో మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించారు.
ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక భారత్ 42.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కానీ మిగిలిన 3.1 ఓవర్లు కూడా భారత్ బ్యాటింగ్ చేయగా.. మొత్తం 5 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. బౌలర్లలో హర్షిత్ రానా 4 వికెట్లతో చెలరేగాడు. ఆకాశ్‌దీప్ 2, సిరాజ్, జడేజా, ప్రసిధ్, సుందర్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
ఇక చేధనకు దిగిన భారత్‌లో ఓపెనర్లు యశస్వి (45), రాహుల్ (27; రిటైర్డ్ హర్ట్), గిల్ (50; రిటైర్డ్ హర్ట్), నితీశ్ రెడ్డి (42), సుందర్ (42*) రాణించారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ (3), సర్ఫరాజ్ ఖాన్ (1) నిరాశపరిచారు. పింక్ బాల్ టెస్టుకు ముందు టీమిండియాకు గులాబీ బంతితో మంచి ప్రాక్టీస్ లభించింది.