20-05-2025 12:22:37 AM
ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నాగల్ గిద్ద, మే19 : నాగలిగిద్ద మండల పరిధిలోని కారస్ గుత్తి శివారులో మీరాబాయి రావణ్ వ్యవసాయ పొలంలో సౌర గిరి జన వికాసం పథకం ద్వారా రైతుల పొలంలో బోర్ వేసే కార్యక్రమాన్ని నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. బోరు వేసిన గంటల వ్యవధిలో నీళ్లు రావడం మీరాబాయి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇందిరా సౌర గిరి జల వికాసం ద్వారా గిరిజన రైతులకు లబ్ది చేకూరేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపకల్పన చేసి సాగునీరు అందించనుంది. రెండున్నర ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్ గుర్తింపు, 2.5 ఎకరాలు దాటితే సమీప రైతులను కలిపి బోర్ వెల్ యూజర్ గ్రూపుగా ఏర్పాటు చేసింది. ఈనెల 25 వరకు మండలాల వారీగా అర్హులైన ఎస్టీ రైతులను ప్రభుత్వం గుర్తించి జూన్ 10 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన, భూగర్భ జలాల సర్వే చేయనుంది.
జూన్ 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు భూములు అభివృద్ధి చేసి బోరుబావుల తవ్వకం, సోలార్ పంపుసెట్ల ఏర్పాటు పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కరస్ గుత్తి పాండురంగ తాండాలో అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
అనంతరం నాగల్ గిద్ద మండలం గూడూరు గ్రామంలో ఎన్‌ఏపీ వాటర్ పంపు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాటర్ గ్రిడ్ అధికారి నర్సింలు, మండల ఎంపీడీవో మహేశ్వర రావు, ఇన్చార్జ్ తహసిల్దార్ శివకృష్ణ, పిఎసిఎస్ చైర్మన్ శ్రీకాంత్, అబ్రెస్ గడ్డే, మాజీ సర్పంచ్ అనిల్ పాటిల్, గిరిజన నాయకులు నారాయణ జాదవ్, గంగారెడ్డి, అంబేద్కర్ పూలే సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రహీం, కార్యదర్శి వై.పండరి పాల్గొన్నారు.