calender_icon.png 23 October, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణ పేదలకు ఇందిరమ్మ వరం

23-10-2025 12:31:17 AM

  1. జీ+1 తరహాలో ఇండ్లకు అవకాశం
  2. కనీసం 30 చదరపు మీటర్ల విస్తీర్ణంలో..
  3. గ్రౌండ్ ఫ్లోర్‌లో, మొదటి అంతస్తులో 200 చ.అ చొప్పున
  4.  స్థలాల కొరత దృష్ట్యా కొన్ని సడలింపులు
  5. సమీక్షలో రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి
  6. జీఎం నెం.69 జారీ చేసినట్లు వెల్లడి

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ‘పట్టణ ప్రాంతంలోని పేదలకు ఇందిరమ్మ పథకం వరంగా మారనుంది. లబ్ధిదారులకు జీ+1 తరహాలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభు త్వం పచ్చజెండా ఊపింది. తక్కువ స్థలం ఉన్నా .. అందులోనే ఇళ్లను కట్టుకునేందుకు అవకాశం కల్పించాం. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీచేశాం’ అని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం గ్రామీణ ప్రాం తాల్లో వేగంగా సాగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లపై బుధవారం మంత్రి సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొం గులేటి మాట్లాడుతూ రాష్ర్టంలోని పట్టణ ప్రాంతాల్లో ఇరుకు స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు పక్కా ఇంటి వసతిని కల్పించేలా ఇందిరమ్మ పథకాన్ని వర్తిం చేలా చర్యలు తీసుకున్నామన్నారు.

కనీసం 30 చదరపు  మీటర్ల విస్తీర్ణంలో జీ+1 తరహాలో ఇంటిని నిర్మించుకునేందుకు అవకా శం కల్పిస్తున్నామని వెల్లడించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో 200 చదరపు అడుగులు, మొదటి అంతస్తులో మరో 200 చదరపు అడుగులు నిర్మించుకునేలా ఈ మేరకు జీఎం నెం.69 జారీ చేసినట్లు వెల్లడించారు. పట్టణ ప్రాం తాల్లో పేదలకు పక్కా ఇంటి వసతిని కల్పించాలన్న లక్ష్యంతో పాటు, స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని కొన్ని సడలింపులు ఇచ్చామని మంత్రి పొంగులేటి వివరించారు.

రాష్ర్టంలోని అనేక పట్టణాలు, నగరాల్లోని పేదలు సొంత ఇంటిని నిర్మించుకోడానికి తగిన స్థలం లేక, అరకొర వసతులతో తాత్కాలిక ఏర్పాట్లతో జీవనం సాగిస్తున్నారని, అటువంటి వారి కోసం ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.

అనేక మంది 60 చద రపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలోని రేకుల షెడ్లు, ఇతరత్రా తాత్కాలిక ఏర్పాట్లతో జీవిస్తున్నారని, వీరికి ఆర్‌సీసీ శ్లాబుతో పక్కా ఇంటిని నిర్మించాలంటే తగిన స్థలం అందుబాటులో లేదని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి పట్టణ ప్రాంతాల్లో జీ+1 నిర్మాణాలకు అనుమతినిస్తూ, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందజేస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని దశల వారీగా నిర్మాణపు పనుల స్థాయిని బట్టి లబ్ధిదారులకు అందిస్తామని వివరించారు. 

పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం ఎలా ఉండాలంటే..

జీ+1 విధానంలో పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులు 96 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 70 అడుగుల విస్తీర్ణంలో వేర్వేరుగా రెండు గదులతోపాటు, కనీసం 35.5 చదరపు అడుగుల్లో వంటగదిని నిర్మించుకోవాలి. ప్రతి ఇంటికీ ప్రత్యేకంగా టాయిలెట్, బాత్‌రూమ్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ ఇంటి నిర్మా ణం ఆర్‌సీసీ స్లాబ్‌తో ఉండాలని, ఇం దుకు సంబంధించిన స్ట్రక్చరల్ డిజైన్లకు డీఈఈ(హౌసింగ్)అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

నాలుగు దశల్లో రూ.5 లక్షలు

జీ+1 పద్ధతిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి మొదటి అంతస్తు రూఫ్‌లెవల్ వరకు నిర్మాణం అయితే  రూ.1లక్ష, అటు తరువాత గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్ వేసిన తరువాత రూ.1లక్ష, ఆపైన ఫస్ట్ ఫ్లోర్‌లో కాలమ్స్, శ్లాబ్, గోడల నిర్మాణాలు పూర్తి అయితే రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తి అయిన తరువాత చివరి రూ.లక్షను విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఒక ఎత్తు అయితే, పట్టణ ప్రాంతాల్లో మరో ఎత్తు అని, ఇది ప్రభుత్వానికి ఒక సవాల్ అని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.