21-07-2025 12:00:00 AM
మిర్యాలగూడ, జులై 20: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో నిబంధనలు సడలించి సొంత ఇంటి స్థలంలోని ఇండ్లు నిర్మించుకునేలా చూడాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు అన్నారు.
ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారిలో చాలామందికి ఇంటి స్థలం తక్కువగా ఉండటం వల్ల నిర్మాణం చేయలేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు పరిశీలించి సొంత ఇంటి స్థలానికి అనుమతులు మంజూరు చేయాలన్నారు.
నాగార్జునసాగర్ ఎగువ కృష్ణ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్ నీటిమట్టం 565 అడుగులకు చేరిందని, సాగర్ ఆయకట్టు ప్రాంతానికి వెంటనే సాగునీటిని విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి అంజనపల్లి రామలింగం, జిల్లా యాదగిరి, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సయ్యద్, మహిళా నాయకురాలు దాసర్ల దుర్గమ్మ, పద్మ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వల్లంపట్ల వెంకన్న, రాజేశ్వరి తదితరులున్నారు.