18-08-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 17 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మానవీయ కోణంలో ముందడుగు వేసింది. వీధి కుక్కల సమస్యపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగు తున్న వేళ.. కుక్కపిల్లలకు కుటుంబాలను వెతికిపెట్టే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని జలగం వెంగలరావు పార్కులో “ఇండీ పప్పీ దత్తత మేళా”ను కమిషనర్ ఆర్‌వి కర్ణన్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి ప్రారంభించారు.
39 ఆరోగ్యకరమైన వీధి కుక్కపిల్లలను మేళా లో ఉంచారు. డీ-వార్మింగ్, అవసరమైన వ్యాక్సినేషన్ పూర్తి చేసిన ఈ కుక్కపిల్లలను దత్తత తీసుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపారు. కమిషనర్ కర్ణన్.. కూకట్‌పల్లికి చెందిన సాయికి ఒక కుక్కపిల్లను అందజేసి తొలి దత్తతను పూర్తి చేశారు. మేళా ముగిసే సమయానికి మొత్తం 24 కుక్కపిల్లలు కొత్త కుటుంబాలకు చేరాయి.
ఈ సందర్భంగా కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ.. కుక్కపిల్లలను దత్తత తీసుకున్న వారి ప్రేమాభిమానాలు, వారి సామాజిక బాధ్యత ప్రశంసనీయం అన్నారు. కేవలం పెంపుడు జంతువులుగా కాకుండా, కుటుంబ నేస్తల్లా ఆదరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్ పాల్గొన్నారు.