calender_icon.png 2 May, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీవోకేలో చొరబడి అక్కడే ఉండాలి

02-05-2025 12:58:22 AM

  1. ఉగ్రవాద స్థావరాలు ఖాళీ చేస్తే ఆక్రమించుకోవాలి
  2. శాశ్వత పరిష్కారం దిశగా అడుగులువేయండి
  3. కేంద్రానికి ఎంపీ ఒవైసీ హితవు

న్యూఢిల్లీ, మే 1: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై తీవ్రంగా స్పందించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి చొరబడి దాడులు చేయడం కాదని, శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలని అభిప్రాయపడ్డారు.

దాడులకు ప్రతిదాడులు చేయకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా భారత్ అడుగులు వేయాలని డిమాండ్ చేశారు. పాక్‌పై యుద్ధం చేయాలనుకుంటే కేంద్రం వ్యూహాత్మక చర్యలను అనుసరిస్తూ పటిష్ఠమైన సైనిక చర్యతో ఉగ్రవాదానికి ముగింపు పలకాలని కోరారు. గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అసదుద్దీన్ పాల్గొన్నారు.

 పహల్గాం ఘటనతో భారత్ ప్రతిదాడి చేస్తుందనే గుబులుతో పీవోకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను పాక్ సైన్యం ఖాళీ చేయిస్తున్నట్టు వార్తలు రావడం, భారత్‌తో యుద్ధానికి భయపడి చాలా మంది పాక్ సైనికులు కుటుంబాలతో కలిసి లండన్‌కు పారిపోతున్నట్టు సమాచారం అందడంపై  స్పందించారు.

ఈ వార్తలు నిజమైతే వెంటనే పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు ఇది మంచి తరుణమన్నారు. ఈ అవకాశాన్ని విడిచిపెట్టొద్దని, పాక్ ఖాళీ చేసిన పీవోకేను వశం చేసుకోవాలన్నారు. ఈసారి చర్యలు తీసుకుంటే ఇంట్లోకి చొరబడి అక్కడే తిష్ట వేయాలన్నారు. బీజేపీ నేతలు ‘ఘర్ మే ఘుస్ కే మారేంగే (ఇంట్లోకి చొరబడి కొడతాం) అన్నారు.. కానీ తాను మాత్రం ‘ఘర్ మే ఘుస్ కే బైఠ్ జావో’ (ఇంట్లో చొరబడి కూర్చోండి) అంటానని పేర్కొన్నారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్‌లో అంతర్భాగమని పార్లమెంట్‌లో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం గతంలో భారత్‌లో జరిగిన ఉగ్ర దాడులను ప్రస్తావిస్తూ.. హైదరాబాద్ లుంబినీ పార్క్, దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లతో పాటు ముంబై 26/11, పుల్వామా, ఉరి, పఠాన్‌కోట్‌లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్రం ఉగ్రవాదానికి ముగింపు పలికే దిశగా అడుగులు వేయాలన్నారు.