calender_icon.png 13 July, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వరాష్ట్రంలోనూ అన్యాయమే..

13-07-2025 01:16:25 AM

- సాధించుకున్న తెలంగాణలోనే అవస్థలుపడ్డాం

- వలసలను చూసి ఉద్యమంవైపు అడుగులేశాం

- ఉద్యమ నాయకుడి నుంచి కౌన్సిలర్ వరకు చీర్ల సత్యం ప్రస్థానం

నీళ్లు, నిధులు, నియామకాలు, వలసలు ఆగాలనే ఉద్దేశంతో ఎంతోమంది అమరవీరుల ప్రాణ త్యాగాల, ఉద్యమకారుల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం. ఆంధ్రా వలసవాదుల పెత్తనాల నుంచి విముక్తి అయిన తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు, వలసలు తగ్గి పోతాయని కలలు కన్నా.. ఆంధ్రా పెత్తందారులు పెట్టిన కష్టాలు కన్నా స్వరాష్టంలో మరిన్ని అవస్థలు పడిన సందర్భాలు ఉన్నాయి.  

ఆంధ్ర పెత్తందారుల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడింది. ఏ పల్లెలో చూసినా సాగు నీళ్లు లేక పంట పొలాలు అన్నీ బీడు బారాయి. ఈ కరువును తట్టుకోలేక ఉపాధి లేక పొట్ట కూటి కోసం ఎందరో తమ పిల్లలను తమ తల్లిదండ్రుల వదిలి పనికోసం ముంబై, గల్ఫ్, షోలాపూర్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు అవ్వ తాతల చేతిలో పెరగడం చూసి మనస్సు చివుక్కుమంది. పొట్ట చేతిలో పెట్టుకుని  బతకాడానికి వెళుతున్న బడుగుజీవులవలసలను చూసి తెలంగాణ వస్తేనే వీటన్నిటికీ  శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఉద్యమం వైపు  అడుగులు వేశాం.

ఆంధ్రకు తెలంగాణకు మధ్య తేడా 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర, తెలంగాణకు మధ్య తేడా చాలా ఉంది. ఉద్యమకారులను 2010లో 100 మంది  ఓయూ ఉద్యమకారులను అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్, జేఏసీ చైర్మన్ కోదండరాంలు  ప్రత్యేకంగా ఆంధ్ర కు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించమని పంపించారు. ఆ సందర్బంలో ప్రకాశం బ్యారేజ్ సమీపంలో  ఒక రైతు తనకున్న అర్థ ఎకరం పొలంలో గడ్డి విత్తనాలు చల్లి పశువులకు గడ్డి మోపులు కట్టి అమ్ముతుంటూ కనిపించాడు.

ఆయన దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నారని  అడుగగా.. గడ్డి మోపులు అమ్మే వ్యాపారం చేస్తున్నానని చెప్పాడు. ఒక్కో గడ్డి మోపు రూ. 500ల చొప్పున రోజుకు రూ.1000 వరకు సంపాదిస్తున్నానని, వచ్చే ఆదాయంలో తన పిల్లలను కార్పొరేట్ విద్యాసంస్థలో చదివించడంతో ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తున్నారనిని చెప్పడం జరిగింది. ఆ రోజు అర్థం అయింది ఆంధ్రాలో పర్యటన ఎందుకు చేయమన్నారో కండ్లకు కట్టినట్లుగా అర్థం అయింది . 

స్వరాష్ట్రంలో ఉద్యమకారులకు అన్యాయం..

రాష్ట్రం సిద్దించిన తరువాత ఉద్యమ నాయకులను ఉద్యమ పార్టీ పట్టించుకున్న పాపాన లేదు. ఉద్యమ విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ దగ్గరకు వెళ్లి కలిస్తే ఆయన ద్వారా అప్పటి మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో కలువడం జరిగింది. స్వరాష్టంలో ఉద్యోగ నోటిఫికేషన్‌లు వస్తాయి, సద్వినియోగం చేసుకోండి, ఒకవేళ ఉద్యోగం రాకపోతే అప్పటి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి గ్రూప్ ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా 100 మంది విద్యార్థి ఉద్యమకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు.

2018 ఎన్నికల సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ మళ్లీ పిలింపించి ఆంధ్ర విడిపోయిన తరువాత ఉద్యోగ విభజనలో కొన్ని సమస్యలు ఉన్నాయని, అవి పూర్తి పరిష్కారం అవుతాయని చెప్పి తిరిగి మొండి చేయి చూయించారు.  ఎమ్మెల్సీ ఎన్నికలో మళ్లీ పిలింపించి మాయ మాటలు చెప్పి మళ్లీ మోసం చేసిండు.  పిలవడం, మాయ మాటలు చెప్పడం, మోసం చేయడం, మోస పోవడం ఉద్యమకారులకు అలవాటు అయ్యింది. 

ఉద్యమ నాయకుడి నుంచి కౌన్సిలర్ వరకు ..

ఉద్యమ నాయకుడిగా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వాల్సిన ఉద్యమ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకుండా అన్యాయం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలిచి పలువురి ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచాను. 

ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో..

 75 ఏండ్ల భారతంలో ఆంధ్ర పెత్తందారుల బలం ఉన్న కారణంగా తెలంగాణలో మాత్రం ఎదుగుదల ఆగింది. ఆంధ్ర, రాయలసీమ నాయకుల పెత్తనం ఎక్కువ కావడంతో నీళ్లు, నిధులు, నియామకాలు మొత్తం ఆగిపోయింది. మహబూబ్ నగర్ వలసల జిల్లాలో  బొంబాయి, బొగ్గు బాయి, దుబాయీలకు వలసలకు వెళ్లేవారు. తెలంగాణలో ఎంత చదువుకున్నా ఉపాధి లేదు. సాగు నీళ్లు లేక పంటలు పండే పరిస్థితి లేదు. అవన్నీ చూసి తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూ యూనివర్సిటీ లో పీజీ చేస్తున్న సమయంలో తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేసేలా చేసింది.

ప్రొఫెసర్ జయశంకర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆనాటి ఉద్యమ నాయకులు బాల్క సుమన్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెంట అడుగులు వేసి ఉద్యమంలో కీలకంగా పని చేసాం. తెలంగాణ వచ్చినా బాధలు తప్పలేదు. జీవితాలను త్యాగం చేసిన విద్యార్థి నాయకులకు ఫలితం శూ న్యం. అమరవీరుల త్యాగాలపైన బీఆర్‌ఎస్  నాయకులు అవినీతి సామ్రాజ్యం నిలించింది. 

 చీర్ల సత్యం, ఉద్యమకారుడు, మాజీ కౌన్సిలర్, వనపర్తి