30-12-2025 12:19:20 AM
దిష్టిబొమ్మల్లా సీసీ కెమెరాలు
నిర్వహణ లోపంతో నిరుపయోగం
ఉపయోగంలోకి తేవాలని ప్రజల విజ్ఞప్తి
కామారెడ్డి, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని కోనాపూర్ గ్రామంలో సీసీ కెమెరాలు చాలా రోజుల నుండి పనిచేయడం లేదు. నిఘా నేత్రంగా పనిచేయాల్సిన సీసీ కెమెరాలు నిద్రావస్థలో వెక్కిరిస్తున్నాయి. మండలంలోని దాదాపు 9 గ్రామాల్లో సీసీ కెమెరాల ను ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. కానీ, 90శాతం కెమెరాలు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. ప్రతి కదలికను పర్యవేక్షించాల్సిన సీసీ కెమెరాలు నిద్రావస్థలో చేరాయి. అడపాదడపా మినహా మరెక్కడా పనిచేయడం లేనట్లుగా స్పష్టమవుతోంది. దొంగతనాలకు ఆస్కారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ఇటీవల దొంగల బెడద ఎక్కువైంది.
పట్టపగలే ఇండ్లు, దుకాణాల తాళాలు పగలగొట్టి నగదు, ఆభరణాలను అపహరిస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. అయితే దొంగలను పట్టుకోవడంలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఇందుకు సీసీ కెమెరాలు నిరూపయోగంగా మారడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. సీసీ కెమెరాల నిర్వహణ సక్రమంగా ఉంటే దొంగతనాలు చేయడానికి సైతం తర్జనభర్జన పడే పరిస్థితి ఉండేది. కానీ యథేచ్ఛగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. మండలంలోని కొన్నిచోట్ల ఇటీవల దొంగతనాలు జరగడమే ఇందుకు నిదర్శనం.
ప్రధాన రహదారులపై మినహాయిస్తే గ్రామాలలో, వార్డుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు స్తంభాలపై వెక్కిరిస్తున్నాయనే చెప్పాలి. అక్రమ దందాల పై ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కులకు సవాల్ విసురుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలోనూ అన్ని కోణాల్లో పర్యవేక్షిస్తున్నారు. అయితే సీసీ కెమెరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలకు మరమ్మతు చేయించడం, కొత్త కెమెరాలను ఏర్పాటు చేయడంలో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఏర్పాటు చేసినట్లుగానే దాతలు, ప్రజాప్రతినిధుల సహకారంతో నైనా క్షేత్రస్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.