22-05-2025 11:33:30 PM
కవిత పచ్చి నిజాలనే చెప్పింది..
కేటీఆర్ తన చెల్లెకు ముందు సమాధానం చెప్పాలి..
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
హైదరాబాద్ (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ లో ముసలం తారాస్థాయికి చేరుకుందని, కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) రాసిన లేఖతో లుకలుకలు బయటపడ్డాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Adi Srinivas) అన్నారు. బీజేపీతో బీఆర్‌ఎస్ కలిసి పనిచేస్తుందని మేం చెబుతున్న మాటలను కవిత సమర్థించారని, బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ సిద్దమతున్నారని కవిత చెప్పకనే చెప్పిందని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీపైన పల్లెత్తు మాట మాట్లాడకుండా కేసీఆర్ వ్యవహరించిన తీరును కవిత కడిగి పారేసిందని, భవిష్యత్తులో బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయన్నారు.
బీఆర్‌ఎస్ బలహీనపడటం వల్లనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు కవిత అంగీకరించారని, కవిత పచ్చి నిజాలు మాట్లాడారని, ఆ మాటలనే మేం చాలా కాలంగా చెబుతున్నామని ఆది శ్రీనివాస్ చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీలో కేసీఆర్ నియంత్రత్వ వైఖరీ ని కూడా కవిత నిలదీశారని, పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఒక్కరే ప్రసంగించడాన్ని కూడా ఆమె ప్రశ్నించారన్నారు. కేసీఆర్ వైఖరీ ని ఆయన కూతురే తప్పుపడుతోందని, ఇక ప్రజలకు వాళ్లేమీ సమాధానం చెబుతారో చూడాలని, కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని కవిత తేల్చి చెప్పిందన్నారు.
కవిత లేఖ పైన బీఆర్‌ఎస్ నాయకత్వం స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలని, సీఎం రేవంత్ రెడ్డి మీద ఒంటి కాలిపైన లేస్తున్న కేటీఆర్ ముందు తన చెల్లి కి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కవిత కు సమాధానం చెప్పకుండా ఇతర పార్టీ లను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్ కు లేదన్నారు. అలిగిన హరీష్ రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ బతిమాలుకున్నాడని, కవిత లేఖతో బీఆర్‌ఎస్ పార్టీ ఇద్దరికి మాత్రమే పరిమిమైందనే విషయం స్పష్టమైందన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన దోపిడి గురించి కూడా కవిత ప్రశ్నిస్తే బాగుంటుందన్నారు. పంపకాలు, పదవుల్లో తేడా వచ్చి కుటుంబంలో లేఖలు రాసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.