22-05-2025 11:26:44 PM
జూపార్కుల్లో జంతువుల పరిరక్షణకి ప్రత్యేక చర్యలు అవసరం..
మంత్రి కొండా సురేఖ స్పష్టీకరణ..
జపాట్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో మంత్రి కొండా సురేఖ..
హైదరాబాద్ (విజయక్రాంతి): ప్రపంచ స్థాయి విధానాలను అవలంభించి రాష్ట్రంలోని జూ పార్కులను నడపాలని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పేర్కొన్నారు. రాష్ట్రంలోని జూ పార్కుల్లో జంతువుల పరిరక్షణకి ప్రత్యేక చర్యలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని అన్ని జూ పార్కులతో పాటు, అర్బన్ ఫారెస్ట్ పార్కులను మెరుగైర సౌకర్యాలతో తీర్చిదిద్దాలని మంత్రి సురేఖ సూచించారు. గురువారం సచివాలయంలో జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. జూలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే... సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తారని అన్నారు.
సందర్శకుల అభిరుచుల మేరకు, పర్యావరణానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, అటవీశాఖకు ఆదాయం సమకూరే విధంగా పకడ్బందీ ప్రణాళికలతో జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పనిచేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా జూ పార్కుల్లో అవలంబిస్తున్న విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ర్టంలోని నెహ్రూ జూ పార్క్, కాకతీయ జూ పార్క్, పిల్లలమర్రి మినీ జూపార్క్, లోయర్ మానేరు డీర్ పార్క్, కిన్నెరసాని డీర్ పార్క్ జంతు సంరక్షణ చర్యలు, కేబీఆర్, మృగవని, మహవీర్ హరిణ వసన్థలి, ఇతర అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో సందర్శకుల సంఖ్య పెరిగినట్టు అధికారులు మంత్రికి వివరించారు.
అయితే, సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, అదనపు సౌకర్యాలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. గత ఏడాది జూ పార్కుల తాలుకూ నిర్వహణ బడ్జెట్ అనుమతులను మంత్రి నుంచి అధికారులు తీసుకున్నారు. ఈ సమావేశంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పిసిసిఎఫ్ డాక్టర్ సువర్ణ (హెఓఎఫ్‌ఎఫ్), చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలుసింగ్ మేరు, సిసిఎఫ్ లు ప్రియాంక వర్గీస్, రామలింగం, జూ పార్క్స్ డైరక్టర్ సునీల్, హేరామత్, పలువురు డిఎఫ్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.