calender_icon.png 23 May, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవ వికాసం... లక్ష్యంతో వికాస తరంగిణి ముందుకు

22-05-2025 10:58:44 PM

త్రిదండి శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి..

హుజురాబాద్ (విజయక్రాంతి): సమాజానికి మంచి చేయాలనే సంకల్పం నేటి మనుషుల్లో పెంపొందించడానికి వికాస తరంగిణి ముందుకు వెళుతుందని త్రిదండి శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి(Chinna Jeeyar Swamy) అన్నారు. గురువారం రాత్రి హుజురాబాద్ పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ధ్వజస్తంభ ఉత్సవ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. యాగశాలలో ఆయన హోమం నిర్వహించి ధ్వజస్తంభానికి పూజలు చేశారు. అనంతరం భక్తులతో ఆయన మాట్లాడుతూ.. నేటి విద్య యాంత్రికంగా ఉంటుందని అలాంటి విద్య వల్ల యంత్రాలాంటి మనుషులే తయారవుతున్నారు కానీ... మనసున్న మనుషులు తగ్గిపోతున్నారని అన్నారు.

అలాంటి మనసున్న మనుషులను తయారు చేయడానికి వికాస తరంగిణి పిల్లల నుండే మంచి భావాలను మంచి ఆలోచనలను పెంపొందించే అనేక కార్యక్రమాలను రూపొందిస్తుందని అన్నారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని మంచి భావాలున్న బాలులను తయారు చేసే ఉత్కృష్ట కార్యక్రమాన్ని వికాస తరంగిణి చేపట్టిందని అన్నారు. మనిషికి వికాసం ఏ విధంగానో సమాజానికి వికాసం అవసరమని అలాంటి వికాసం కలిగిన సమాజ నిర్మాతలు ప్రతి ఒక్కరూ కావాలని ఆయన అభిలాషించారు. సమాజంలో, కుటుంబంలో మహిళల పాత్ర ఎంతో ఉన్నతమైనదని ఉత్కృష్టమైనదని అలాంటి మహిళలకు ఉన్నతమైన స్థానాన్ని ప్రతి ఒక్కరు అందించాలని అలాంటి అభిప్రాయాలను పెంచాలని అన్నారు.

పిల్లలకు సంస్కారం తెలపడం ద్వారా మంచి సమాజం లభిస్తే, మహిళలకు గౌరవం అందించే సమాజం ఉత్కృష్టమైనదని అది భారతావనిలోనే సాధ్యమని అన్నారు. హుజురాబాదులో వికాస తరంగిణి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ఈ ప్రాంత మేధావులు విద్యావంతులు అభినందనీయులని అన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లల తయారు చేయడం కోసం, ఎలాంటి వ్యాధులు సంక్రమించని మహిళల కోసం వికాస తరంగిణి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వికాస తరంగిణి... సమాజ వికాసం కోసం పనిచేస్తుందని, ఆ సమాజ మార్పు కోసం ఉన్నత భావాలు కలిగిన మంచి యువతి యువకులు మహిళలు పెద్దలు ముందుకు రావాలని ఆయన సూచించారు.

వికాస తరంగిణి ఆధ్వర్యంలో లక్షలాదిమంది మహిళలకు ఆరోగ్య పరిరక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి వారి ఆరోగ్య రక్షణకు బాటలు వేసినట్లు ఆయన తెలిపారు.  హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... స్వామి వారి ఆశీస్సులతో తాను ఉన్నత పదవులు పొందానని ఆయన దీవెనలు తోనే ముందుకు సాగుతున్నానని అన్నారు. ఆయన చూపిన మార్గంలో తాను నడుచుకుంటానని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి, కుటుంబ సభ్యులు, న్యాయమూర్తి సంధ్యారాణి వికాస తరంగిణి జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాధాకృష్ణ, ఆలయ చైర్మన్ క్యాస చక్రధర్, పుల్లూరి ప్రభాకర్ రావు, వర్దినేని రవీందర్రావు గందె శ్రీనివాస్ శ్రీధర్ ఆచార్యులు నిఖిలాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.