calender_icon.png 23 May, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీట్లు 4.5 లక్షలు.. రిజిస్ట్రేషన్లు 89 వేలు!

22-05-2025 11:37:42 PM

ముగిసిన వెబ్ ఆప్షన్ల గడువు..

ఈ నెల 29న మొదటి విడుత సీట్ల కేటాయింపు

హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు ఆదరణ తక్కువైంది. డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ(Degree Online Services Telangana) మొదటి విడుతకు చాలా తక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ఈ నెల 22 వరకు 89,572 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియను నమోదు చేసుకున్నారు. ఇందులో ఫీజు చెల్లించిన వారు 80,701 మంది కాగా.. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన వారు మాత్రం 72,543 మందే ఉన్నారు. వీరిలో 63,613 మంది విద్యార్థులు మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ గడువు బుధవారంతో, వెబ్ ఆప్షన్ల గడువు గురువారంతో ముగిసింది. ఈ నెల 29న మొదటి విడుత డిగ్రీ సీట్లను విద్యార్థులకు కేటాయించనున్నారు.

2025 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో 1057 డిగ్రీ కాలేజీలుండగా.. వాటిలో మొత్తం 4,57,724 సీట్లున్నాయి. అయితే వీటిలో 70 ప్రైవేట్ కాలేజీలు నాన్ దోస్త్ కింద ఉన్నాయి. వీటిలో 40,603 సీట్లున్నాయి. ఈ సీట్లను దోస్త్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా ఆయా కాలేజీలే సొంతంగా ప్రతీ ఏటా భర్తీ చేసుకుంటున్నాయి. మే 30 నుంచి జూన్ 8 వరకు రెండో విడుత, జూన్ 13 నుంచి 19 వరకు మూడో విడుత రిజిస్ట్రేషన్లు చేపట్టి, సీట్లను జూన్ 23న కేటాయించనున్నారు. అయితే తల్లిదండ్రులు తమ  పిల్లల్ని ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో చేర్పించేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో డిగ్రీలో జాయిన్ అవుతున్న వారి సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. 2024 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ కాలేజీల్లో 4,57,704 సీట్లు అందుబాటులో ఉంటే, వాటిలో 2.12 లక్షల సీట్లు మాత్రమే నిండాయి.