27-01-2026 12:00:00 AM
వేములవాడ, జనవరి 26,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు వెడల్పు, డ్రైనేజీ, పైపు లైన్ పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం పరిశీలించారు. మూలవాగులో మురికి నీరు గుడి చెరువులో కలవకుండా చేపడుతున్న ప్రత్యేక పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ మెయిన్ రోడ్డులో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సుమారు రూ.47 కోట్ల వ్యయంతో రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నామని, మూలవాగుగుడి చెరువు కాలుష్య నివారణకు రూ.10 కోట్లతో పైపు లైన్ పనులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి గాలికి వదిలేసిన పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేస్తోందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కోరుట్ల బస్స్టాండ్ నుంచి చెక్కపల్లి రోడ్డు వరకు రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు.గత 50 ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న కీలకమైన అభివృద్ధి ఇది అని, మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా పట్టణంలోని 28 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని చెప్పారు.
అదనంగా మరిన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.4 కోట్ల 20 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను గమనించాలని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.