24-05-2025 12:15:26 AM
జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్.
నాగర్ కర్నూల్ మే 23 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సదుపాయాలతో నాగర్కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శుక్రవారం మండల అధికారులతో కలిసి సర్వే నెం. 816 లోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని 5 నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు ఒకే క్యాంపస్లో విద్యనభ్యసించేలా స్కూల్ నిర్మాణం జరుగుతుందన్నారు. విద్యుత్, నీరు, ఆట స్థలాలు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పారదర్శకంగా యువతకు రాజీవ్ యువ వికాసం.
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాస పథకంను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.. బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనారిటీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో కలిసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై తన చాంబర్లో సమీక్ష జరిపారు.
అంతకు ముందు తెలకపల్లి మండలంలోని చిన్న ముద్దునూరు గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే తూకం వేసి మిల్లులకు తరలించేలా లారీల సంఖ్య పెంచుకోవాలని సూచించారు.
ఎక్కడ ఎలాంటి అలసత్వం వహించినా శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి అక్కడి యువతతో కాసేపు ముచ్చటించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ఇంటిని ఆయన సందర్శించారు. లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా వేగంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.