12-07-2025 12:44:19 AM
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్‌హెచ్‌జీల ఆర్థిక సాధికారత కోసం రూ. 344 కోట్ల వడ్డీలేని రుణాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రామీణ మహిళా సంఘాలకు రూ. 300 కోట్లు, పట్టణ మహిళా సంఘాలకు రూ. 44 కోట్లు కేటాయించింది. ఈ నిధులను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్) ద్వారా పంపిణీ చేయనున్నది.
జూలై 12వ తేదీనుంచి 18వ తేదీ వరకు మహిళా సంఘాల ఖాతాల్లో నిధులను అధికారులు జమ చేయనున్నారు. ఈ చెక్కులను రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారు. వీటితోపాటు అదనంగా మహిళా సంఘాలకు ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులు కూడా అందజేయనున్నారు. అయితే బీఆర్‌ఎస్ హయాంలో మహిళా సంఘాల వడ్డీ లేని రుణాలు నిలిచిపోయాయి.
దాదాపు రూ. 3,000 కోట్లకుపైగా గత ప్రభుత్వం బకాయి పెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వడ్డీలేని రుణాలను తిరిగి చెల్లిస్తుంది. దీంతో మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపా ల్లో అనూహ్య వృద్ధి కనబడుతుంది. మంత్రి సీతక్క చొరవతో మహిళా సాధికారతకు ఊతం లభిస్తుందని ఎస్‌హెచ్‌జీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.