26-11-2025 12:00:00 AM
* హుస్నాబాద్ మహిళలకు రూ. 5.66 కోట్లు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, నవంబర్ 25 :తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ’మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి’ కార్యక్రమం ద్వారా స్వయం సహాయక (ఎస్ హెచ్ జీ) మహిళా సంఘాలకు భారీగా 304 కోట్ల వడ్డీలేని రుణాలు విడుదల చేసింది. దీనిలో భాగంగా మంత్రి క్వార్టర్స్లో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన మహిళా సంఘాలకు రుణాలను పంపిణీ చేశారు.
నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని 5,329 సంఘాలకు రూ. 5,66,16000 వడ్డీలేని రుణాల చెక్కులను అందించారు. ఈ రుణాలలో హుస్నాబాద్ మండలానికి 445 సంఘాలకు రూ.46 లక్షలు, అక్కన్నపేట మండలానికి 754 సంఘాలకు రూ. 85 లక్షలు, కోహెడ మండలానికి 964 సంఘాలకు అత్యధికంగా రూ.1.18 కోట్లు పంపిణీ చేశారు. చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు రూ. 86 లక్షల చొప్పున, భీమదేవరపల్లి మండలానికి రూ.85.16 లక్షలు, ఎల్కతుర్తి మండలానికి రూ.74. 42 లక్షలు అందించారు.
* మహిళలకు పెద్దపీట
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రభుత్వం ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. ‘రాష్ట్రంలో పరిశ్రమలకు లోన్ కావాలన్నా బ్యాంకర్లు ఇప్పుడు మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. మహిళలు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో రాణించాలి‘ అని పిలుపునిచ్చారు.
మహిళా సంఘాలకు ప్రభుత్వం ఎన్ని కోట్లు అయినా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, ముఖ్యంగా ఆ లోన్ల వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. 18 సంవత్సరాల పైబడిన మహిళలందరూ సంఘాల్లో చేరి ఆర్థికంగా ఎదగాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల డీఆర్డీవోలు జయదేవ్ ఆర్యా, శ్రీధర్, రవికుమార్, వెంకటేశ్ తో పాటు ఏంఎస్వోబీలు పాల్గొన్నారు.