30-12-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ ౨౯: ఆరావళి పర్వత శ్రేణుల్లో గనుల తవ్వకాలపై సోమవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. పర్వతాల నిర్వచనం విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 100 మీటర్లలోపు ఉన్న పర్వత శ్రేణుల్లో మైనింగ్‌కు నాడు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా అత్యున్నత న్యాయస్థానం పర్యావరణ పరిరక్షణ అంశానికి ప్రాధాన్యమిస్తూ సుమోటోగా విచారణ చేపట్టింది.
కేసును పునః సమీక్షించింది. సుప్రీం కోర్టు ఆరావళి మైనింగ్ అంశంపై విచారణ జరిపింది. పాత తీర్పు కారణంగా తలెత్తే దుష్పరిణామాలను నిశితంగా పరిశీలించించి ఈ కేసులో అమికస్ క్యూరీని నియమించింది. అలాగే గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒక ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. పర్వతాల మధ్య ఉండే 500 మీటర్ల మేరకు ఉండే ఖాళీ ప్రదేశాల్లో మైనింగ్ అనుమతించాలా వద్దా అనే అంశంపై స్పష్టత కావాలని, శాస్త్రీయ ఆధారాలతో కూడిన భౌగోళిక నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించింది.
కమిటీ నివేదిక వచ్చే వరకు పాత ఆదేశాలపై స్టే కొనసాగుతుందని తేల్చిచెప్పింది. మైనింగ్‌పై వివాదం దృష్ట్యా పర్వత శ్రేణుల్లో మైనింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడాలని కోర్టు భావిస్తోంది. రాజస్థాన్, హర్యానా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో భూగర్భ జలాల రక్షణలో పర్వత శ్రేణి ముఖ్యపాత్ర పోషిస్తుందని పేర్కొంది. థార్ ఎడారి తూర్పు దిశగా విస్తరించకుండా ఆరావళి పర్వత శ్రేణి ఒక రక్షణ కవచంలా ఉపకరిస్తున్నాయని, అత్యంత పురాతనమైన ఈ పర్వత శ్రేణులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం నొక్కిచెప్పింది.
ప్రజారోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అభిప్రాయపడింది. కేసు తదుపరి విచారణను జనవరి 21కు వాయిదా వేసింది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ తాజాగా సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రకృతిప్రేమికులు, పర్యావరణ వేత్తలు, సామాజిక ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేసు పూర్వాపరాలు
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచించిన నిర్వచనాన్ని నవంబర్ 20న సుప్రీంకోర్టు ఆమోదించింది. దీని ప్రకారం భూతలానికి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న వాటినే పర్వత శ్రేణులని గుర్తించాలని పర్యావరణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నిర్ణయంపై పర్యావరణవేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం పర్వతాల ఎత్తును ప్రాతిపదికగా తీసుకుంటే, దాదాపు 90 శాతం అరావళి ప్రాంతం మైనింగ్ పాలవుతుందని పేర్కొన్నారు.
నిర్వచన తీర్పు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారుతుందని గళమెత్తారు. పర్వతాల నిర్వచనాన్ని మార్చడం వల్ల అక్రమ మైనింగ్‌కు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు సర్వే ఆఫ్ ఇండియా సాయంతో అన్ని రాష్ట్రాల్లోని పర్వతాల మ్యాపింగ్ ప్రక్రియ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రప్రభుత్వాలకు మార్గదర్శకాలు ఇచ్చింది. సుప్రీం కోర్టు తాజా స్టే ఆర్డర్‌తో ఈ ప్రక్రియ నిలిచిపోనుంది.
పర్వత శ్రేణి 2059 నాటికి కనుమరుగయ్యే ప్రమాదం
సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఆరావళి పర్వతశ్రేణులు ఏర్పడ్డాయి. అన్ని సంవత్సరాల చరిత ఉన్న వర్వత శ్రేణులు ఇప్పుడు మానవ తప్పిదాల వల్ల పర్వతాలు వాటి ఉనికి కోల్పోయే దశకు చేరున్నాయి. రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన అనేకమంది పరిశోధకులు 44 ఏళ్లపాటు అనేక ఉపగ్రహాలిచ్చిన సమాచారాన్ని విశ్లేషించి కీలకమైన విషయాలు వెల్లడించారు. 1975 నుంచి 2019 మధ్య కాలంలో ఆరావళి ప్రాంతంలో సుమారు 5,772 చదరపు కి.మీ మేర అటవీ ప్రాంతం నాశనమైందని వెల్లడించారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే 2059 నాటికి మరో 16,360 చదరపు కి.మీ మేర అటవీ విస్తీర్ణం పూర్తిగా అంతరించిపోతుందని తెలిపారు. పోడు, మైనింగ్, రియల్ ఎస్టేట్, పట్టణీకరణ కారణంగా అటవీ విస్తీర్ణం తగ్గుతోందని స్పష్టం చేశారు. వాయువ్య భారతానికి పర్యావరణ రక్షణ కవచంలా ఉన్న ఈ పర్వత శ్రేణి జీవవైవిధ్యానికీ ప్రతీక అని పేర్కొన్నారు. విస్తీర్ణం తగ్గినా కొద్దీ రాజస్థాన్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో భూగర్భజలాలూ తగ్గుతాయని తెలిపారు.