calender_icon.png 30 December, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెంగార్‌ను విడుదల చేయకండి!

30-12-2025 12:00:00 AM

  1. అత్యాచార కేసులో దోషి, నేరచరిత ఉన్న వ్యక్తికి బెయిల్‌లా?
  2. ఎమ్మెల్యేను పబ్లిక్ సర్వెంట్‌గా భావించలేమన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు తప్పు
  3. ఆ వ్యాఖ్యలు ఎమ్యెల్యేలకు లేనిపోని వెసులుబాటునిస్తాయి: సుప్రీంకోర్టు
  4. దోషికి మంజూరు చేసిన బెయిల్‌పై అత్యున్నత న్యాయస్థానం స్టే
  5. ఉన్నావ్ అత్యాచార కేసు విచారణ జనవరి నెలాఖరుకు వాయిదా

న్యూఢిల్లీ, డిసెంబర్ ౨౯: ఉన్నావ్ అత్యాచార కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. ఈ తీర్పుతో సెంగార్ జైలు నుంచి విడుదల నిలిచింది. బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై నాలుగు వారాల్లో బదులివ్వాలని సెంగార్‌ను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను జనవరి నెలాఖరుకు వాయిదా వేసింది.

సెంగార్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఈనెల ౨౩న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కిందికోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఒక ఎమ్మెల్యేను పబ్లిక్ సర్వెంట్‌గా పరిగణించలేమంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ తరహా వ్యాఖ్యలు చట్టసభ సభ్యులకు లేనిపోని వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. సెంగార్ కేవలం ఈ అత్యాచార కేసులోనే కాకుండా బాధితురాలి తండ్రి కస్టడీ మరణం కేసులోనూ పదేళ్ల శిక్ష అనుభవిస్తున్నారని గుర్తుచేసింది. సెంగార్ ఇతర క్రిమినల్ కేసుల్లోనూ దోషిగా తేలాడని నొక్కిచెప్పింది. ఇంతటి నేర చరిత్ర కలిగిన వ్యక్తిని జైలు నుంచి విడుదల చేస్తే అత్యాచార బాధితురాలితోపాటు ఆమె కుటుంబ సభ్యులకు ముప్పు ఉంటుందని పేర్కొంది.

కాబట్టి తదుపరి ఆదేశాలిచ్చే వరకు సెంగార్ జైలులోనే ఉండాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంపై అత్యాచార బాధిత కుటుంబుం హర్షం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు పై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని దోషులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని తాజా సుప్రీంకోర్టు తీర్పు రుజువు చేస్తోందని బాధితురాలి తరఫు న్యాయవాదులు వెల్లడించారు.