09-03-2025 12:00:00 AM
అదేంటీ చేపలు నీళ్లల్లో ఉంటాయి కదా.. వాటికి కోటలేంటి? అనే సందేహం వచ్చిందా పిల్లలూ.. నీటిలోనే చేపలకు కోటలు కట్టేయొచ్చు తెలుసా? అదేలాగంటే.. అక్వేరియంలో.. అక్వేరియం అంటే రంగుల చేపలూ.. నీళ్లతో నిండిన గాజు తొట్టె మాత్రమే కాదు.. అంతకుమించి అంటున్నారు ఇంటీరియల్ డెకరేషన్ డిజైనర్లు. అందమైన కట్టడాల్నీ, అద్భుతమైన సీనరీల్నీ చేపల మధ్యలోకి చేర్చేస్తూ అక్వేరియాన్నే అబ్బురపరిచే విధంగా డిజైన్ చేసి చూపిస్తున్నారు..
అక్వేరియంలో అటూ ఇటూ తిరిగే చేపల్ని కాసేపు చూస్తేనే ఎంతో సరదాగా ఉంటుంది. మరి మిలమిల కాంతుల ఆ చేపల ఆటలే.. చూడచక్కని కోటల మధ్యలో కనిపిస్తే.. పొలాల గట్ల మీద ఉంటే.. కొండగుహల పరిసరాల్లో చూస్తే.. అబ్బ ఇంకెంత ముద్దొస్తాయో కదా.. ఇదిగో.. అచ్చంగా అలాంటి అనుభూతినివ్వడానికే వచ్చాయి ఇక్కడున్న డైవ్ ఇన్‌టూ మ్యాజిక్ అక్వేరియంలు.
అక్వేరియాలను హాల్లో ఒక పక్కనో.. టీపాయ్ మీదనో పెట్టుకునేవాళ్లు. కాని ఇంటీరియల్ ట్రెండ్లకు తగ్గట్టు అక్వేరియం లుక్ కూడా పూర్తిగా మారుతూ వచ్చింది. నీళ్లు, చేపలు.. చిన్న చిన్న గులకరాళ్లు.. చిట్టి చిట్టి మొక్కలతో కనిపించే అక్వేరియమే టీపాయ్‌లోకి దూరిపోయింది. ఇంకా గోడ మీదా మెరిసింది. నాలుగు మూలల సాదా గాజు తొట్టె.. ఇలా రకరకాల రూపాలు మార్చుకుని అందంగా తయారైపోయింది. భిన్నంగా నీటిలోపలే సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారు డిజైనర్లు.
అందమైన సీనరీల్ని కాసేపు చూస్తే ప్రశాంతంగా ఉంటుంది. వాటి వల్ల ఇంటికి అదనపు అందం కూడా. చూడచక్కని కట్టడాల చిత్రాల్నీ, బొమ్మల్నీ ఇంట్లో పెట్టుకుంటారు. ఈసారి అలాంటి వాటినే అక్వేరియం డెకరేషన్లోకి తీసుకొస్తే ఎలా ఉంటుందీ అనుకున్నారేమో డిజైనర్లు. ఈ కొత్త ఫిష్ ట్యాంకులకు రూపమిచ్చారు.
పెద్ద సైజు గాజు తొట్టెల్ని తీసుకుని అందులో నీళ్లు, రంగు రంగుల చేపలతోపాటు కోటలూ, ఇళ్లు, అందమైన కట్టడాల నమూనాల్నీ ఉంచుతున్నారు. ఇష్టమైన థీమ్‌కు తగ్గట్టు అదనంగా మినియేచర్ వంతెనల్నీ, కొండల్లాంటి వాటినీ ఈ అక్వేరియంలో అమర్చుతారు. చూడగానే ఏదో ఊహాలోకంలో.. వింత ప్రపంచంలా.. ఎంత అద్భుతంగా ఉంటాయో అవన్నీ కూడా. కావాలంటే మన ఇంట్లో ఉన్న అక్వేరియాన్ని కూడా వీటిల్లా మార్చుకోవచ్చు. అందుకు అవసరమైన ఫెయిరీ టేల్ కోటలూ, రకరకాల నిర్మాణాల నమూనాలూ ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి.