calender_icon.png 23 August, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్రాష్ట్ర దొంగల ముఠా రిమాండ్

22-08-2025 12:27:05 AM

ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి

కామారెడ్డి ఆగస్టు 21 (విజయ క్రాంతి ) మాయమాటలు చెప్పి చోరీలకుపాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల  సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర దొంగల ముఠా వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 26న భిక్కనూరులోని దత్తాత్రి వెదురుబొంగుల షాప్‌లో ఉన్న ఊరే లక్ష్మి వద్దకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి షాప్ పేరుపై నీకు లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పారు.

అనంతరం ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు పూస్తెలతాడును దొంగిలించారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన  బిక్కనూరు పోలీసులు పలు ఆధారాలుసేకరించారు. టోల్‌గేట్ వద్ద ఒకరిని, కామారెడ్డిలో ముగ్గురు అనుమానితులను అదుపు లోకి తీసుకుని విచారించగాచోరీ చేసిన విషయాన్ని ఒప్పుకున్నారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ముథ్కేడ్‌కు చెందిన ఆఫ్తాబ్ అహ్మద్ షేక్, ఉమ్రికి చెందిన ఫహీమాబేగం, నాగపూర్ సిటీకి చెందిన కబీరుద్దీన్, అబ్దుల్ రహ్మాన్ షేక్, నాగపూర్‌కు చెందిన దీపక్ కిసాన్ సాలుంకేలను పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరి నుంచి 3 తులాల పుస్తెల తాడు, రెండు కార్లు, ఒక బైక్, మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వీరు చోరీల కు పాల్పడడంతో కేసులు నమోదైనట్లు తెలిపారు.  ఆదిలాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలో ఎనిమిది చోరీలకు సంబంధించి  నేరాలను ఒప్పుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్ అహ్మద్ షేక్ గతంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలో దాదాపు 60 వరకు దొంగతనాలు, అటెన్షన్ డైవర్షన్ దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు.

ఇతని గురించి ఆదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలకు సంబంధించిన పోలీసులు గాలింపు చేపట్టినా చిక్కలేదన్నారు. కేసు ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పి చైతన్య రెడ్డి, భిక్కనూర్ సిఐ సంపత్ కుమార్, ఎస్త్స్ర ఆంజనేయులు పాల్గొన్నారు.