calender_icon.png 18 November, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: కమిషనర్ వెంకటగోపాల్

18-11-2025 12:00:00 AM

  1. ఐజీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన రూ.38 కోట్లను దశలవారీ అభివృద్ధి పనులకు వినియోగం
  2. గుండ్లపోచంపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో  అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదు
  3. సామాన్య ప్రజలను తమ పనులను చేయకుండా ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం 
  4. జీ ప్లస్ 2 అనుమతి తీసుకుని అదనపు అంతస్తులు వేసి వాణిజ్య వ్యాపారాలు చేస్తున్న వారి వివరాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం
  5. భవనాలకు అగ్నిమాపక శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి

మేడ్చల్ అర్బన్ నవంబర్ 17(విజయక్రాంతి): గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతామని మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట గోపాల్ పేర్కొన్నారు. సోమవారం గుండ్లపోచంపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి మంత్రి దిద్దుల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో గుండ్లపోచంపల్లి పురపాలక సంఘం మరింత అభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.

ఈ క్రమంలోనే అయోధ్య చౌరస్తా నుంచి కొంపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులను త్వరలో చేపట్టే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. అదేవిధంగా గుండ్లపోచంపల్లి పురపాలక సంఘం పరిధిలో సహజ వనరులు,మౌలిక సదుపాయాలు వాతావరణ కాలుష్యం లేకుండా ఎస్టిపిలను ఏర్పాటు చేసి మురుగు కాలువలను సకాలంలో నిర్మాణం చేపడుతూ అవసరమైన చోట సీసీ రోడ్లు నిర్మాణం కొనసాగిస్తామని తెలిపారు.

అదేవిధంగా పురపాలక సంఘం పరిధిలో ప్రజలు సిటిజన్ చార్ట్ ప్రకారం అందరికీ సేవలు అందిస్తామని ప్రత్యేకంగా ప్రజలకు అత్యవసర సమయంలో సైతం అందుబాటులో ఉంటూ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు.  గుండ్లపోచంపల్లి పురపాలక సంఘం పరిధిలో టాక్స్ ల రూపంలో రావలసిన నిధులు రూ.16 కోట్ల 13 లక్షలు ఉండగా బకాయిల రూపంలో మరికొంత సొమ్ము అదనంగా ఉన్నట్టు తెలిపారు.

టాక్స్ ల రూపంలో 49 శాతం వసూలు చేశామని తద్వారా వచ్చిన ఆదాయాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు,ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.ముఖ్యంగా గుండ్లపోచంపల్లి పురపాలక సంఘం పరిధిలో బాలుర వసతి గృహాలు,బాలికల వసతి గృహాలు అధిక సంఖ్యలో ఉన్నాయని ఆ వసతి గృహాల యజమానులు తమ బాధ్యతగా విద్యార్థిని, విద్యార్థుల పూర్తి జాబితాను తయారు చేసుకుంటూ వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, అనుమానవస్పదంగా ఉన్న విద్యార్థుల వివరాలు వారి తల్లి దండ్రులకు తెలియజేయాలని మరీ శృతిమించితే పోలీసులకు సైతం సమాచారం ఇవ్వాలని తెలిపారు.

అదే విధంగా జీ ప్లస్ 2 భవన అనుమతులు తీసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు నిర్మించి వాణిజ్య, వ్యాపారాలు నిర్వహిస్తున్న భవన యజమానుల వివరాలు సేకరించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని సదరు భవన నిర్మాణాలకు అగ్నిమాపక శాఖ అనుమతులు ఉండాలని తెలిపారు.అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు లేని భవనాలపై సైతం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మున్సిపల్ పురపాలక సంఘం పరిధిలో కొంతమంది మాజీ ప్రజా ప్రతినిధులు ఇప్పటికీ తామే ప్రజాప్రతినిధులమని కొనసాగుతూ ఇష్టరీతిన వ్యవహారాలు చక్కబట్టేలా చూస్తున్నారని దానికి పురపాలక సంఘం అధికారులు సైతం తలొగ్గేలా ఒత్తిడి పెంచుతున్నారని ఒత్తిడి పెంచినంత మాత్రాన సిటిజన్ చార్ట్ నిబంధనల మేరకే పనులు చేస్తామని కమిషనర్ అన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.