27-11-2024 12:00:00 AM
‘ఇస్కాన్’కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని దేశద్రోహనేరం కింద బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేయడంతో ఆ దేశం లో మైనారిటీ హిందువుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఢాకా విమానాశ్రయంలో సోమవారం బంగ్లాదేశ్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. గత అక్టోబర్ 30న చిన్మయ్‌దాస్‌సహా 19 మందిపై చిట్టగాంగ్‌లోని కొత్వాలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది.
హిందూ సమాజం చేపట్టిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనేది ఆరోపణ. మంగళవారం ఆయనను స్థానిక కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి బెయిలు నిరాకరించడంతో జైలుకు తరలించారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద వందలాది మంది మద్దతుదారులు ఆందోళన చేయ డంతో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణదాస్ అరెస్టును భారత్‌లోని ఇస్కాన్ సంస్థ తీవ్రంగా ఖండించింది.
ఇటీవల బంగ్లాదేశ్ వరదల్లో బాధితులకు పెద్ద ఎ త్తున ఆహారాన్ని పంపిణీ చేసిన తమ సంస్థకే ఇలాంటి పరిస్థితి రావడంపై ఆవేదన వ్యక్తం చేసింది. తమది శాంతి, ప్రేమ కల భక్తి ఉద్యమం మాత్రమేనని ఆ సంస్థ ‘ఎక్స్’లో పేర్కొంది. కష్ణదాస్‌ను విడిపించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందిస్తూ హిందువులు, మైనారిటీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరినట్లు తెలిపారు. బంగ్లాదేశ్‌లో గత ఆగస్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల తిరుగుబాటుతో అప్పటి ప్రధాని షేక్ హసీనా గద్దె దిగి పారిపోయినప్పటినుంచీ హిందువులపై దా డులు ఎక్కువయ్యాయి.
దేశంలో ఎక్కడో ఒక చోట తరచూ హిందువులపై, ఇస్కాన్ ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. హసీనా పార్టీ ఇస్కాన్‌కు మద్దతు ఇస్తోందనే అనుమానాలు దీనికి ప్రధాన కారణం. హిం దువులపై పెరిగిపోతున్న దాడులకు వ్యతిరేకంగా కృష్ణదాస్ ‘బంగ్లాదేశ్ స మ్మిళిత సనాతన్ జాగరణ్ జోతే’ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసి శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
హిందువులపై దాడులకు నిరస నగా ఈ నెల 22న రంగ్‌పూర్‌లో కృష్ణదాస్ భారీ ప్రదర్శన నిర్వహించడంతో పాటుగా మైనారిటీల రక్షణకు డిమాండ్ చేస్తూ తాత్కాలిక ప్రభు త్వం ముందు ఎనిమిది డిమాండ్లు కూడా ఉంచారు. తమకు న్యాయపరమైన రక్షణను పెంచాలని, ప్రభుత్వంలో మైనారిటీ వ్యవవహారాల మంత్రి త్వ శాఖను ఏర్పాటు చేయాలనేది హిందూ వర్గాల ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు మరోసారి దేశంలో ఉద్రిక్తతకు దారి తీస్తోంది.
వాస్తవానికి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నంతకాలం అక్కడ హిందువులు సురక్షితంగానే ఉన్నారు. భారత్‌తో హసీనా ప్రభుత్వానికి ఉన్న సత్సంబంధాలు దీనికి ప్రధాన కారణం. అయితే ఆమె గద్దె దిగడంతోనే మతతత్వ శక్తులకు కొత్త బలం వచ్చినట్లయింది. గత నాలుగు నెలల కాలంలో దేశవ్యాప్తంగా హిందూ ఆలయాలపైన, హిందువుల ఇళ్లపైన వందల దాడులు జరిగాయి.
ఇస్కాన్‌ను నిషేధించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు బంగ్లాదేశ్‌ను ఇస్లాం దేశంగా ప్రకటించాలనే డిమాండ్ కొత్తగా వినిపిస్తోంది. ఒకప్పడు బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా 20 శాతానికి పైగా ఉండేది. అయితే అది ఇప్పుడు 9 శాతానికి పడిపోయింది. హిందువుల్లో ఎక్కువ మంది షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ మద్దతు దారులే.
ఈ కారణంగానే మతతత్వశక్తులు వాళ్లపై దాడులు చేస్తున్నాయి. అయితే హిందువులపై దాడులు పెరిగిపోయాయన్న ఆరోపణలను తాత్కాలిక ప్రభుత్వం అధినేత, నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ తోసిపుచ్చుతున్నారు. ఈ దాడులకు రాజకీయాలకు సంబంధం లేదనేది ఆయన వాదన. పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకొంటున్న పరిణామాలు భారత ప్రభుత్వానికి సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. మరి ఈ పరిణామాలపై మోదీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.