17-08-2025 12:50:29 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 16 (విజయక్రాంతి): ముంబైలో ప్రభుత్వ స్థలాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చి భారీగా ఆస్తులు కూడబెట్టిన వాసవి- విరార్ టౌన్‌ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డిని ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో ఏకంగా రూ.10 కోట్ల నగదు, రూ.23 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
ముంబైలోని వాసవి-విరార్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వైఎస్‌రెడ్డి.. ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ నిర్మాణాలకు అక్రమం గా అనుమతులు మంజూరు చేసి కోట్లకు పడగలెత్తినట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. అక్రమ అనుమతుల ద్వారా బిల్డర్లు, రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి భారీ మొత్తంలో ముడుపులు అందుకున్నట్లు ఈడీకి పక్కా సమాచారం అందిం ది.
ఈ లావాదేవీలన్నీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో హైదరాబాద్‌లోని వైఎస్‌రెడ్డి నివాసంపై ఈడీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సోదాలు చేస్తున్న అధికారులే నివ్వెరపోయేలా ఆయన ఇంట్లో నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. లెక్కించగా రూ.10 కోట్ల నగదు, సుమారు రూ.23 కోట్ల విలువైన బంగారం ఉన్నట్లు తేలింది.
మొత్తం రూ.33 కోట్ల విలువైన అక్రమాస్తులను ఈడీ అధికారులు సీజ్ చేశారు. వైఎస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని ఈడీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరిపేందుకు ఆయనను కస్టడీకి కోరనున్నట్లు సమా చారం. ఈ అక్రమ దందాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, రాజకీయ నాయకులు, ఇతర ఉన్నతాధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది.