17-08-2025 12:47:27 AM
సన్నబియ్యం పంపిణీతో మిగిలిన బియ్యం
1.40 లక్షల టన్నులకు పైగా స్టాక్
మూడు, నాలుగు నెలలుగా నిల్వ
గోదాంలు, రేషన్ షాపుల్లోనే ముక్క పడుతున్న రైస్
క్వింటా ధర రూ.3 వేలకు పైనే ఉండేలా నిర్ణయం?
బియ్యం విక్రయించాలనే ఆలోచనలో ప్రభుత్వం
హైదరాబాద్, ఆగస్టు 1౬ (విజయక్రాంతి): రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారుల కు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణి చేస్తోంది. దీంతో ప్రభుత్వం వద్ద దొడ్డు బియ్యం భారీగా మిగిలిపోయింది. అంతకుముందు రేషన్‌షాపుల ద్వారా పంపిణీకి సిద్ధంగా ఉంచిన, పం పిణీ చేయగా మిగిలిపోయిన దొడ్డు బియ్యా న్ని విక్రయించేందుకు టెండర్లను ఆహ్వానిచాలని ప్రభుత్వం భావిస్తోంది.
అందుకు గోదాం లు, రేషన్ షాపుల్లో ఉన్న బియ్యం వివరణాలను పౌర సరఫరాల శాఖ సేకరిస్తోంది. అం తేకాకుండా రేషన్‌షాపులు, గోదాంల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం ముక్క పడితే దేనికి పనికి రావని, అందుకు మిగిలిన దొడ్డు బియ్యాన్ని వేలం వేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తం గా 17వేలకు పైగా రేషన్ షాపులు ఉన్నాయి.
అయితే ఈ రేషన్‌షాపులు, గోదాంల్లో 1.40 లక్షల టన్నుల దొడ్డు బియ్యం నిల్వ ఉన్నట్లుగా సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. గోదాముల్లో లక్ష టన్నులు, మండల స్థాయి స్టాక్ పాయింట్లలో 13 వేల టన్నులు, రేషన్ షాపుల్లో 27 వేల టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం తో.. దొడ్డు బియ్యం అవసరం లేకుండా పోయింది. దీంతో దొడ్డు బియ్యం వేలానికి టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
ఎఫ్‌సీఐ ధర రూ. 2,250..
అయితే ఎఫ్‌సీఐ వద్ద ఉన్న బియ్యం నిల్వలను క్వింటాలుకు రూ. 2,250 చొప్పు న విక్రయించాలని నిర్ణయించింది. అయితే ఎఫ్‌సీఐ ప్రొవిజనల్ కాస్టింగ్ షీట్ ప్రకారం బియ్యం ధర క్వింటాలుకు రూ. 3,600 ఉంటుంది. కానీ, ఎఫ్‌సీఐ మాత్రం రూ. 2,250 చొప్పున విక్రయాలు చేపడుతోంది. ఈ ధరకు బియ్యం అప్పగించడం ద్వారా నష్టపోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
గ్లోబల్ టెండర్లు
ఇతర రాష్ట్రాల్లో దొడ్డు బియ్యం విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నా లు చేసింది. కర్ణాటక రాష్ట్రానికి రాష్ట్ర సివిల్ సప్లయ్ అధికారులు వెళ్లి వచ్చినా అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ సహా ఇతర రాష్ట్రాల కు ఎగుమతి చేయడానికి చేసిన ప్రయత్నా లు కూడా ఫలించలేదు. దీంతో దొడ్డు బి య్యం విక్రయానికి గ్లోబల్ టెండర్లు పిలవాలని, వీలైనంత ఎక్కువ ధరకు విక్రయిం చాలని నిర్ణయంతో ఉన్నారు.
అయితే రేషన్ డీలర్లకు ఒకేసారి మూడు నెలల బియ్యం సరఫరా చేయడం.. అంతకు ముందే మిగిలిన దొడ్డు బియ్యం వల్ల స్థలం సరిపోవడం లేదని, అదనంగా షాప్‌లు కిరాయికి తీసుకోవాల్సి వస్తుందని, దీంతో ఆర్థికంగా అదనపు భారం పడుతుందని రేషన్ డీలర్లు వాపోతున్నారు.