08-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి) : ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు కబ్జాదారుల నుంచి హైడ్రా రక్షిస్తుంటే.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎందుకు ఆందోళన చెందుతున్నాడని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమం తరావు ప్రశ్నించారు. రూ. వందలాది కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను బీఆర్‌ఎస్ నాయకులు నుంచి కాపాడుతున్న హైడ్రాను కేటీఆర్ బద్నాం చేయడం సరికాదని వీహెచ్ హితవు పలికారు.
శుక్రవారం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను కబ్జా చేసిన వ్యక్తే.. బీఆర్‌ఎస్ పార్టీకి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కబ్జాల గురించి పట్టించుకోని కేటీఆర్.. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హైడ్రా విషయంలో పేద ప్రజలను రెచ్చగొట్టే విధంగా తగదని మండిపడ్డారు. హైడ్రా చేస్తున్న పనులను ప్రజలు స్వాగతిస్తుంటే బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేక చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు.
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి బిఆర్ ఎస్‌కు కొమ్ము కాస్తున్నారని అంబర్‌పేటలో ఒక ఫ్లుఓవర్ నిర్మాణం తప్ప ఏమి చేయలేదని వీహెచ్ పేర్కొన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు మహేందర్ , కాంగ్రెస్ సీనియర్ నేత లక్ష్మణ్ యాదవ్, పీసీసీ కార్యదర్శి శంబూల శ్రీకాంత్ గౌడ్ , మాజీ కార్పొరేటర్లు పుల్ల నారాయణస్వామి, దిడ్డి రాంబాబు, గరిగంటి రమేష్. మోతా రోహిత్ రామ్మోహన్, కృష్ణ గౌడ్, గడ్డం శ్రీధర్ గౌడ్, వెంకట్ గౌడ్ , కోటం అనిల్ , రావుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.