calender_icon.png 29 August, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల కోటాకు స్పెషల్ జీవో?

29-08-2025 05:24:56 AM

  1. న్యాయవాదులతో మంత్రుల కమిటీ చర్చలు 
  2. సీఎం రేవంత్‌రెడ్డితోనూ భేటీ అయిన కమిటీ 

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ న్యాయ నిపుణు లు, కోవిదులతో విస్తృతంగా సమావేశం నిర్వహిస్తోంది. రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచినా ఎటువంటి ఫలితం రాకపోవడంతో.. రాష్ట్ర పరిధిలోనే రిజర్వేషన్లు కల్పించేందుకు సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు.

అందులో భాగంగా బుధవారం గాంధీభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు తదితరులు సమావేశమయ్యా రు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా ముందుకు వెళ్లాలా? అనే అంశంపై చర్చించారు.

గురువారం సీఎం రేవంత్‌రెడ్డితోనూ మంత్రుల కమిటీ సమావేశమైంది. కమిటీ ముందుకు చర్చకు వచ్చిన మూడు అంశాలను రేవంత్‌రెడ్డికి వివరించినట్లు తెలిసింది. ఒకటి పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం, రెండోది స్పెషల్ జీవోతో రిజర్వేషన్లు ఇవ్వడం, మూడోది కేంద్రం ఆమోద ముద్రవేసే వరకు వేచి చూసి.. ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయడం వంటి అంశాలను సీఎంకు వివరించారు.

సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థ ల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేయడంతో .. ఈ మూడు ప్రతిపాదనల్లో ఏది బెస్ట్‌గా ఉంటుందని చర్చించారు. పార్టీపరంగా ఇవ్వడం కంటే .. జీవో ఇచ్చి ఎన్ని కలకు వెళదామనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. బీసీలకు 42 శాతం ఇస్తే.. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక ఏ రాజకీయ పార్టీని అయినా ప్రజల్లో ఎండగట్టేందుకు మంచి అవకాశం వస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఆ తర్వాత పార్టీపరంగా ఆలోచన చేయవచ్చని అభిప్రాయంతో ఉన్నట్లుగా సమాచారం.