01-08-2025 01:03:24 AM
వేములపల్లి, జూలై 3౧ : వేములపల్లి మండలంలో మట్టి రవాణా నిత్య కళ్యాణం పచ్చ తోరణం. 365 రోజులు అక్రమ రవాణా కొనసాగుతూనే ఉన్న పట్టించుకునే అధికారులే లేరా.!అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా పంట పొలాల మధ్య ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టి యదేచ్చగా మట్టి దందాను కొనసాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎర్ర మట్టి తవ్వకాలు పగలు రాత్రి తేడా లేకుండా కొనసాగుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు.
వెంచర్లు, మిల్లులకు మట్టిని తరలిస్తున్నారు.కొందరు అక్రమార్కులు అధికారులతో చేతులు కలిపి ఎర్ర మట్టిని తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. అధికారుల ప్రజా ప్రతినిధుల అండదండలు మెండుగా ఉండడంతో దందాను కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామ శివారులో నుంచి ఈ రవాణా కొనసాగుతుంది.
ఈ మట్టి రవాణా పొలాల మధ్య నుంచి జరుగుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలాల మధ్యలో గుంతలు తోవడంతో భూగర్భ జలాలు తగ్గి బోర్లలో నీరు రావడం లేదని పరిసర ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మట్టి రవాణా వేములపల్లి మండలం లోని భీమవరం- సూర్యాపేట ప్రధాన రహదారి గుండా మిల్లులకు, తరలిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రైతుల ఆందోళన.
మట్టి రవాణా తో రోడ్లు ధ్వంసం అవుతుండడంతో రైతులు ఇక్కడ నుంచి రవాణా జరగవద్దని ఆందోళనలు చేశారు. మట్టి రవాణా జరుగుతున్నప్పుడు దుమ్ముదులి పొలాలపై పడి పంట నాశనం అవుతుందని. రోడ్లు మొత్తం గుంటల మయమయ్యాయని ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలంటే ప్రమాదానికి గురవుతున్నామని రైతులు వాపోతున్నారు.
ఎంత ఆందోళన చేసినా రవాణా కొనసాగుతుండడంతో అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎలాంటి పర్మిషన్లు లేవు
మట్టి రవాణాకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు. అక్రమంగా మట్టి రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. వేములపల్లి తహసిల్దార్ కు తెలపగలరు.
ఏజీ జాకబ్, నల్గొండ జిల్లా మైనింగ్
పర్మిషన్ ఉన్న బండ్లను వదిలి పెట్టాము
పర్మిషన్ ఉన్న బండ్లను వదిలి పెట్టాము. పర్మిషన్ లేకుండా ఉన్న బండ్లను కార్యాలయానికి తరలించాము. వీరికి చలానలు ఉన్నాయి. ప్రాసెసింగ్ లేవు. ప్రాసెసింగ్ లెటర్ ల కోసం నల్గొండ పోయారు. ఆ లెటర్లు చూపిస్తే మిగతా బండ్లను వదిలేస్తాం. జెసిపి దగ్గరికి మేము వెళ్లలేదు. జెసిపి గురించి తెలియదని తాసిల్దార్ తెలిపారు.
హేమలత, వేములపల్లి తహసీల్దార్
పట్టించుకునే అధికారే కరువయ్యాడు
రోడ్లు ధ్వంసమై రోడ్డు కింద ఉన్న పైపులైన్లు, గూనలు పగిలిపోతున్న పట్టించుకునే అధికారి కరువయ్యాడు. మించి ఓవర్ లోడ్ చేసుకుని 30 నుంచి 40 టన్నుల బతుకుతున్నాం టిప్పర్లు ఈ రోడ్డు గుండా తిరగడంతో రోడ్డు కింద ఉన్న పైపులైన్లు బోనాలు పలుకుతున్నాయి.
మట్టి టిప్పర్లు తిరుగుతుండడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమై గుంతలుగా మారడంతో పొలాలకు వెళ్లే రైతులు ప్రమాదాల వారిని పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు అప్పటికైనా అధికారులు స్పందించి మట్టి దందాను ఆపాలని కోరుతున్నాం.
రైతు నాగయ్య