calender_icon.png 20 December, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇషాన్ కిషన్ విధ్వంసం

19-12-2025 12:00:00 AM

జార్ఖండ్‌దే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ

పుణే, డిసెంబర్ 18 : దేశవాళీ క్రికెట్ టోర్నీ సయ్య ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో జార్ఖండ్ 69 పరుగుల తేడాతో హర్యానా చిత్తు చేసింది. టైటిల్ పోరులో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను వన్‌సైడ్‌గా మార్చేశాడు. ఈ సీజన్ ఆరంభం నుంచీ పరుగుల వరద పారిస్తున్న ఇషాన్ కిషన్ తుది పోరులోనూ చెలరేగిపోయాడు. కేవలం 49 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు.

అతని విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు,6 ఫోర్లు ఉన్నాయి. ఇషాన్‌తో పాటు కుషాగ్రా 81,అంకుల్ రాయ్ 40, రాబిన్ మించ్ 31 పరుగులతో మెరుపులు మెరిపించడంతో జార్ఖండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 262 పరుగుల భారీస్కోర్ చేసింది. ఛేజింగ్‌లో హర్యానా ఆరంభంలోనే చేతులెత్తేసింది. కేవలం 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ అంకిత్ కుమార్, ఆశిష్ స్వచ్ఛ్ డకౌటయ్యారు. యశ్‌వర్థన్ దలాల్  (53), సమంత్ జకార్(38) మాత్రమే పర్వాలేదనిపించారు.

జార్ఖండ్ బౌలర్లలో సుశాంత్ మిశ్రా 3, బాలకృష్ణ 3 , అంకుల్ రాయ్ 2, వికాస్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అంకుల్ రాయ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. జార్ఖండ్‌కు ఇది రెండో దేశవాళీ క్రికెట్ టైటిల్. గతంలో 2010 సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీ గెలిచింది. ఇదిలా ఉంటే జాతీయ జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ ఈ టోర్నీలో అద్భుతంగా రాణించాడు.

10 మ్యాచ్‌లలో 57కు పైగా సగటుతో 517 పరుగులు చేశాడు. దీని లో రెండు సెంచరీలున్నాయి. అటు సారథిగానూ తనదైన ముద్రవేశాడు. ఎలైట్ స్టేజ్‌లో వరుసగా 7 మ్యాచ్‌లలో గెలిపించాడు. తర్వాత సూపర్‌లీగ్‌లో మూడు మ్యాచ్‌లలో రెండు గెలిపించాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రా క్ట్ కోల్పోయిన ఇషాన్ టీ20 ప్రపంచకప్ ముంగిట ఫామ్‌లోకి వచ్చాడు.