26-07-2025 07:07:02 PM
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్...
జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) తెలిపారు. శనివారం రోజున ధర్మపురి నియోజకవర్గంలోని పెగడపల్లి మండలంలో రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో అర్హులైన 4,468 లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్(District Collector Satya Prasad)తో కలిసి పంపిణీ చేశారు. అదేవిధంగా 62 మంది లబ్దిదారులకు 62,07,192 విలువగల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలోని మండల పరిధిలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు.
అలానే రేషన్ కార్డు రాని వారు కంగారు పడాల్సిన పని లేదని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, కార్డు రాని వారు మీ సేవలో కానీ.. లేదంటే ప్రజాపాలనలో మరో సారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో దాదాపు 10 సంవత్సరాల తర్వాత.. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ కార్డులో కొత్త పేర్లను కూడా కలిపేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. వాటన్నింటిని పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి మళ్లీ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అందని కార్డులు ఇప్పుడు వారి చేతుల్లోకి రానుండటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ధాన్యం, నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు అందించేందుకు ఈ కార్డులు కీలకం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ దిశగా చేసిన మరో గొప్ప అడుగు అని పలువురు పేర్కొంటున్నారు. తద్వారా మరిన్ని పేద కుటుంబాలు ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల నుండి లబ్ధిపొందే అవకాశం కలుగనుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్, డి ఆర్ డి ఓ రఘువరన్, ఎంపిడిఒలు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.