31-07-2025 12:38:12 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
ఖానాపూర్, జూలై 30: అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం ఖానాపూర్ మండలంలోని సత్తెనపెల్లి గ్రామ రైతు వేదికలో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులు పేదలకు వరంగా మారాయన్నారు.
ఖానాపూర్ మండలంలో మొత్తం 1,669 కొత్త కార్డులు జారీ చేయడంతో పాటు 2,532 కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం జరిగింది. వచ్చే నెల నుంచే లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ఇంకా అర్హులైన వారు మిగిలి ఉంటే, వారు దరఖాస్తు చేసుకోవచ్చని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటివరకు మండ లంలో మొత్తం 4201 కొత్త కార్డులు మంజూరయ్యాయని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ, గత పదేళ్లుగా కొత్త కార్డుల మంజూరుల్లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. పెన్షన్లు, రైతు రుణమాఫీ, యువకిరణాలు వంటి పథకాలు కార్డుల లేకపోవడంతో అర్హులకు మంజూరు కాలేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహాలక్ష్మి ఫ్రీ బస్సు, 200 యూని ట్లు ఉచిత విద్యుత్తు, రూ.500కి గ్యాస్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
కడెం ప్రాజెక్టు మారమ్మత్తులకు 9కోట్ల 40 లక్షలు, సదర్మాట్ కెనాల్ మరమ్మతులకు రూ.39 లక్షలు, ఖానాపూర్ పట్టణానికి త్రాగునీటి సదుపాయం కోసం అమృత్ పథకం కింద రూ.20 లక్షలతో పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్, శాసనసభ్యులు కలిసి మహిళలకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అలాగే మైనా ర్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇందిరా మహిళ పథకం కింద మహిళలకు కుట్టుమిషన్లు పంపి ణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భూషణ్, వైస్ చైర్మన్‌అ మాజీద్, పి ఏ సి ఎస్ చైర్మన్ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డిఎస్‌ఓ రాజేందర్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సునీతతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యను అందించాలి
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఉత్తమ విద్య, వసతులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బుధవారం ఖానాపూర్లోని ప్రభుత్వ గిరిజన బాల, బాలికల వసతి గృహాలను ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని నాణ్యమైన విద్యను అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా, తక్షణమే మెరుగైన చికిత్స అందించాలన్నారు. రాత్రి వేళల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులకు అందుబాటులో ఉండాలన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వసతి గృహాల్లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందని తెలిపారు. అధికారులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వసతి గృహాల్లో సమస్యలు తలెత్తిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం కలెక్టర్ భవిత కేంద్రంను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, మండల ప్రత్యేక అధికారి జీవరత్నం, తహసీల్దార్ సుజాత, ఎంపిడిఓ సునీత, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.