22-12-2025 12:00:00 AM
మణుగూరు,డిసెంబర్21,(విజయక్రాంతి): తెలంగాణకు గుండెకాయలాంటి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని, టీబీ జీకేఎస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వెంకట్ ఆరోపించారు. టీబీజీకేఎస్ కార్యాలయం లో ఆదివారం జరిగిన ముఖ్య బాధ్యుల సమావేశం ఆయన మాట్లాడారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, వైద్యం కోసం నిధులను వినియోగిస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవసరాల కోసం సంస్థ నిధులను దుర్వినియోగం చేస్తున్న దని ధ్వజమెత్తారు.
కార్మికుల కష్టార్జితాన్ని గద్దల తన్నుకుపోతూ సింగరేణి నిధులను రాష్ట్ర పథకాల ప్రచారం కోసం వాడుకుంటూ దుర్వినియోగలకు పాల్పడు తుందని ఇది దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుండి సింగరేణి ఆవిర్భావ వేడుకలు అత్యంత గొప్పగా అట్టహాసంగా నిర్వహించడం జరిగిందని కానీ, నేడు రేవంత్ ప్రభుత్వ పాలనలో నిధుల ను మరింతగా తగ్గించి పేలవంగా వేడుకలు నిర్వహించడం సంస్థ అస్తిత్వాన్ని కార్మిక ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందన్నారు.వేడుకలకు యాజమాన్యం నిధులు కేటాయించకపోవడం, జీ ఎం కార్యాలయ ఆవరణలో వేడుకలు నిర్వహించడాన్ని తప్పుపట్టారు.
సంస్థ ప్రగతి, సంస్కృతి సంప్రదాయాలకు , పోరాట స్ఫూర్తికి నిలువుటద్దంగా నిలిచే వేడుకల ఖ్యాతిని తూ తూ మంత్రంగా నిర్వహించడం సింగరేణి సంస్థను కార్మికలోకాన్ని అవమాన పరచడమే అవుతుందని పేర్కొన్నారు. ఈసమావేశంలో నాయకులు పవన్ కుమార్, నాగేశ్వరరావు, సంపత్ , ముకేశ్ కుమార్, రమేష్, పరమేష్ , రమేష్ నాయక్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఇజ్రాయిల్, మురళీ కృష్ణ, రాజ్ కుమార్, రామాచారి మస్తాన్, రెడ్డి, నరేష్, ఇమ్రాన్ ఖాన్, కళ్యాణ్,కృష్ణ, ప్రసాద్, నరేందర్ పాల్గొన్నారు.