05-07-2025 12:00:00 AM
టీపీసీసీ అధ్యక్షుని వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్
అదిలాబాద్, జూలై 4 (విజయ క్రాంతి) : కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసినంతగా ఏ పార్టీ మోసం చేయలేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. ఆదిలాబాద్ లో శుక్రవారం ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడుతూ..
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీ లకు ఇస్తా అని మోసం చేసిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. దేశ ప్రధాన మంత్రి మోదీ బీసీ నాయకుడని, కేంద్ర క్యాబినెట్లో బీసీ లకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత నరేంద్రమోడీ కే దక్కిందన్నారు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకు పెట్టీ పోయిందని ఎద్దేవా చేశారు. కనీసం దేశంలో కాగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేకపోయారన్నారు.
ఇవన్నీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలుసుకుంటే బాగుంటదని హితవుపలికారు. నామినేట్ పదవులు ఈ రాష్ట్రంలో బీసీలకు ఎందుకు ఇవ్వడం లేదని, మీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారని ప్రశ్నించారు. మహేష్ కుమార్ గౌడ్ భారతీయ జనతా పార్టీని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడమే అని అన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతమందికి మీరు బీసీలకు టికెట్ ఇచ్చారో ముందు తెలుసుకోవాలన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచం ద్ర రావు 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నారని, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి విమర్శలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల ప్రవీణ్, రఘుపతి, లాలామున్న, జోగు రవి, కృష్ణ యాదవ్, భరత్, భీమ్ సేన్ రెడ్డి తదితరులు ఉన్నారు.