కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే

28-04-2024 02:00:29 AM

రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పని అయిపోయింది

ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం  

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ

మంచిర్యాల, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఓడినట్టే కేంద్రంలో బీజేపీ ఓడటం ఖాయమని, కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు. శనివారం సాయంత్రం నస్పూర్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన కార్మిక గర్జన, మంచిర్యాల మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ సక్రమంగా నెరవేర్చలేదని, ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను పక్కాగా అమలు చేస్తామని తెలిపారు.

అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదని, కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ యేనన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని రాష్ట్రంలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉందని పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, యూత్ కాంగ్రెస్  జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథ్, రోహిత్ చౌదరి, ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్ రావు, రాజ్ ఠాకూర్ సింగ్, గడ్డం వివేక్ వెంకటస్వామి, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ పాల్గొన్నారు.