09-10-2025 10:07:00 PM
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్..
కోరుట్ల రూరల్ (విజయక్రాంతి): ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వంచక హామీలను ఎండగడుతూ “కాంగ్రెస్ బాకీ కార్డులు” పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ “ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అని ఎన్నికల సమయంలో మధురమైన మాటలతో, అబద్ధపు హామీలతో ప్రజలను ఆకట్టుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదనీ అన్నారు. 420 హామీలు ఇచ్చినా వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదనీ, ఈ రోజు రాష్ట్రం అంతటా రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో విసిగిపోయారనీ అన్నారు.
తెలంగాణ ప్రజలు ఎంతో కష్టపడి సాధించిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చీకటిలోకి నెడుతోందని రైతులకు ఉచిత విద్యుత్ తగ్గించడం, పింఛన్లలో ఆలస్యం, ధాన్యం కొనుగోలులో అస్తవ్యస్తం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల హామీ కేవలం పేపర్లోనే ఉంచడం ఇవన్నీ కాంగ్రెస్ ద్రోహ పాలనకు నిదర్శనమని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో వచ్చిన అభివృద్ధిని ఈ ప్రభుత్వం పూర్తిగా నిలిపేసింది అన్నారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ ప్రజలకు అందించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించడం మా బాధ్యత అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందనీ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.