31-10-2025 01:24:18 AM
 
							రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలె: మంత్రి పొన్నం ప్రభాకర్
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సురేఖ, ఎంపీ, ఎమ్మెల్యే
విజయక్రాంతి నెట్‌వర్క్, అక్టోబర్ 30 : ‘గత నలభై ఏండ్లలో ఇంతటి వాన ఎప్పుడూ పడలేదు’ అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హుస్నా బాద్‌లో వరద నీటిలో మునిగిపోయిన వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు.
మార్కెట్ యార్డు మొత్తం వరదనీటిలో మునిగిపోయి వందలాది మెట్రిక్ టన్నుల వడ్లు, మక్కలు తడిసిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్న రైతుల ఆవేదనను చూశారు. ‘రైతులు ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం మీ వెంటే ఉంటుంది‘ అని ధైర్యం చెప్పారు. తన వడ్లు మొత్తం కొట్టుకుపోయాయని రోదించిన రైతు వీరవ్వకు తక్షణ సహాయంగా రూ.10 వే లు అందజేశారు. తడిసిన ప్రతి బస్తా నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
ఇది ఒక పెను విపత్తు అని ఆవేదన వ్యక్తం చేశారు. కోహెడ మండలం బస్వాపూర్‌పోరెడ్డిపల్లి, అక్కెనపల్లి ప్రాంతాల్లో తెగిపోయిన రోడ్లు, మోయతుమ్మెద వాగు వద్ద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఇది కేవలం ప్రాంతీయ వర్షం కాదు, జాతీయ స్థాయిలో గుర్తించాల్సిన ప్రకృతి విపత్తు అని, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
కేంద్రం రాజకీయాలకు అతీతంగా స్పందించి, ఆదుకోవాలని, ఇందు కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని కోరారు. చిగురుమామిడి మండలంలో సీతారాంపూర్ చౌరస్తా నుంచి గ్రామం లోప ల వరకు దెబ్బతిన్న రోడ్డు, కూలిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఇందుర్తి- మధ్య హైలెవల్ బ్రిడ్జి మంజూరు చేస్తామన్నారు.
ప్రజలకు తక్షణ సహాయం అందించాలి: ఎంపీ పర్యటన
మొంథా తుఫాన్‌తో భారీ వర్షంతో హనుమకొండలోని అలంకార్ సర్కిల్, కాపువా డలో వరద ప్రభావిత ప్రాంతాలను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పరిశీలించారు. వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు పాల ప్యాకెట్లు, తాగునీరు పంపిణీ చేశారు. ప్రజలకు తక్షణ సహాయం అందించాలని అధికారులకుసూచించారు. నిత్యం అండగా ఉంటూ అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని
లోతట్టు ప్రాంతాల్లో గురువారం ఉద యం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విస్తృత పర్యటన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించాలని, వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. వరదల్లో చిక్కుకున్న వారికి భోజనం పొట్లాలు, వాటర్ బాటిళ్లు అందించామని తెలిపారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను పునరావస కేంద్రాలను తరలించామని పేర్కొన్నారు.
ప్రతి కుటుంబానికీ సహాయం
వరంగల్ పరిధి ఎన్‌ఎన్‌నగర్, బీఆ ర్‌నగర్ వరద ముంపు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ డా. సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి క్షేత్ర స్థాయిలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటించారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ వరద ముంపు బాధితులను పరామర్శించి, కొనసాగుతున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగా సమీక్షించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని, ప్రతి కుటుంబానికీ సహాయం అందిస్తామని వారికి భరోసా కల్పించారు.